కొత్త పెన్షన్లకు విశేష స్పందన
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:04 AM
ఎన్‌టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు జిల్లాలో విశేష స్పందన లభిస్తున్నది. అర్హులైన వారంతా ఈనెల 7 నుంచి 16 తేదీ వరకు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే.
ఈనెల 7 నుంచి ఇప్పటివరకు
13,085 మంది దరఖాస్తుల సమర్పణ
నేటితో ముగియనున్న దరఖాస్తుల స్వీకరణ
గడువు పెంచాలని గిరిజనుల వేడుకోలు
పాడేరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
ఎన్‌టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు జిల్లాలో విశేష స్పందన లభిస్తున్నది. అర్హులైన వారంతా ఈనెల 7 నుంచి 16 తేదీ వరకు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లాలోని 11 మండలాల్లోని 212 సచివాలయాల పరిధిలో ఈనెల 15వ తేదీ వరకు వివిధ పెన్షన్లకు సంబంధించి 13,085 దరఖాస్తులు అందాయని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. వీటిలో వృద్దాప్య పెన్షన్‌కు 9,690 మంది, వితంతువులు 2,211, దివ్యాంగులు 1,095, ఒంటరి మహిళలు 78, మత్స్యకారులు 6, ట్రాన్స్‌జెండర్లు 3, డప్పు కళాకారులు 1, చర్మకారులు 1 చొప్పున మొత్తం 13,085 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఏజెన్సీలో అధిక శాతం పేదలు, అసలైన లబ్ధిదారులు ఎక్కువ మంది ఉండడంతో ఈనెల 7 నుంచి ఆయా పెన్షన్లకు దరఖాస్తులు చేస్తున్నారు. అయితే గడువు ఈనెల 16వ తేదీతో ముస్తుండడంతో పలువురు అర్హులైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
స్వీకరణ గడువు పెంచాలని వేడుకోలు
సామాజిక పెన్షన్ మంజూరుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గడువును మరికొన్ని రోజులు పెంచాలని గిరిజనులు కోరుతున్నారు. ఏజెన్సీలో ఇంటర్నెట్ సాంకేతిక సమస్యలతోపాటు సర్వర్ మొరాయించడం వంటి సమస్యలతో సకాలంలో దరఖాస్తులు చేసుకోని పరిస్థితి నెలకొంది. అర్హులైన మరికొందరికి సమర్పించాల్సిన ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఇంకా దరఖాస్తులు చేసుకోవాల్సిన అర్హులు సైతం ఉన్నారని పలువురు అంటున్నారు. ఈ తరుణంలో దరఖాస్తుల స్వీకరణకు మరో పది రోజులు గడువు పెంచాలని కోరుతున్నారు.