Share News

పొంగిన డ్రైనేజీలు

ABN , Publish Date - May 02 , 2026 | 01:04 AM

నగరంలో శుక్రవారం కురిసిన చిన్నపాటి వర్షానికే మురుగు కాలువలు, గెడ్డలు ఎక్కడికక్కడ పొంగడంతో చెత్తా,చెదారం రోడ్లపైకి చేరింది.

పొంగిన డ్రైనేజీలు

  • చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ చెత్తమయం

  • గెడ్డలు, డ్రైనేజీల్లో పూడికతీత

  • సరిగా తీయకపోవడమే కారణం

  • రానున్నది వర్షాకాలం...ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు మేల్కొనకుంటే కష్టం

విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి):

నగరంలో శుక్రవారం కురిసిన చిన్నపాటి వర్షానికే మురుగు కాలువలు, గెడ్డలు ఎక్కడికక్కడ పొంగడంతో చెత్తా,చెదారం రోడ్లపైకి చేరింది. గత కొంతకాలంగా గెడ్డలు, మురుగు కాలువల్లో ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి. వాటిని తొలగించడంలో జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యం వహించారు. శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం ఒక మోస్తరు వర్షం కురవడంతో ఆ నీరు కాలువలు, గెడ్డల్లోకి చేరింది. అయితే కాలువల్లోని చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, మద్యం సీసాలు వరద నీటి ప్రవాహానికి అడ్డుగా మారాయి. దీంతో మద్దిలపాలెం, అక్కయ్యపాలెం, ద్వారకానగర్‌, సంజీవయ్య కాలనీ వంటి ప్రాంతాల్లో మురుగు కాలువలు, గెడ్డలు పొంగి వర్షంనీటితోపాటు వ్యర్థాలు కూడా రోడ్లపైకి చేరాయి. వర్షం తగ్గిన తర్వాత వ్యర్థాలు రోడ్లపై నిలిచిపోవడంతో చెత్తమయంగా కనిపించాయి. జీవీఎంసీ అధికారులు ఇప్పటికైనా నగరంలోని గెడ్డలు, కాలువల్లో పూడికతీత, వ్యర్థాల తొలగింపు చేపట్టకపోతే భారీవర్షం కురిసినప్పుడు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారడం ఖాయమని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - May 02 , 2026 | 01:04 AM