Share News

జగన్‌ పర్యటనలో కార్యకర్తల అత్యుత్సాహం

ABN , Publish Date - Jul 31 , 2026 | 01:13 AM

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నగర పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు.

జగన్‌ పర్యటనలో కార్యకర్తల అత్యుత్సాహం

పోలీసుల ఆంక్షలు బేఖాతరు చేస్తూ ఎయిర్‌పోర్టు వద్ద హడావిడి

విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి):

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నగర పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు గురువారం గన్నవరం నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకున్న ఆయన...ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం వెళ్లారు. అయితే జన సమీకరణ, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఖాతరు చేయలేదు. జనాన్ని ఎయిర్‌పోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడ జగన్‌ను అనుకూలంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని హంగామా చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి జగన్‌ వాహనంలో కాకానినగర్‌ , ఎన్‌ఏడీ కూడలి, గోపాలపట్నం మీదుగా శ్రీకాకుళం బయలుదేశారు. కాన్వాయ్‌లో పదికి మించి వాహనాలకు అనుమతి లేదని పోలీసులు ముందే స్పష్టంచేశారు. అయినా భారీగా వాహనాలు కాన్వాయ్‌లో చేరడంతో వాటిని కాకానినగర్‌ వద్ద పోలీసులు ఆపేశారు. మార్గమధ్యంలో పలుచోట్ల వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు, జగన్‌ ఫొటోలు పట్టుకుని నిలబడగా జగన్‌ వాహనం ఆపి వారికి అభివాదం చేసి ముందుకు వెళ్లారు.


సామాజిక పింఛన్లు 90.2 శాతం పంపిణీ

విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో గురువారం వివిధ కేటగిరీల వారికి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. మొత్తం 1,57,117 మందికిగాను 1,41,727 మందికి (90.2 శాతం) పెన్షన్లు అందజేశారు. నాలుగు గ్రామీణ మండలాల్లో 26,085 మందికిగాను 23,967 మందికి, జీవీఎంసీ పరిధిలో 1,31,032 మందికిగాను 1,17,760 మందికి పింఛన్లు పంపిణీ చేసినట్టు డీఆర్‌డీఏ పీడీ బెందాళం లక్ష్మీపతి తెలిపారు.


ఏయూకు కొత్త పాలకవర్గం

ఐఐపీఎం మాజీ డైరెక్టర్‌ వీఎస్‌ఆర్కే ప్రసాద్‌, పాలక్కాడ్‌ ఐఐటీ డైరెక్టర్‌కు చోటు

సీనియర్‌ ఆచార్యుల కోటాలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి ఆచార్య వి.వల్లీకుమారికి,

ప్రిన్సిపాళ్ల కోటాలో మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆర్‌.పద్మశ్రీకి స్థానం

విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం నూతన పాలక వర్గాన్ని నియమించింది. ప్రస్తుతమున్న పాలక వర్గాన్ని రద్దు చేసిన ప్రభుత్వం, తొమ్మిది మందితో కొత్త పాలక వర్గాన్ని నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. విశ్వవిద్యాలయం పరిధిలో సీనియర్‌ ఆచార్యుల కోటాలో ఏయూ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి ఆచార్య వి.వల్లీకుమారి, కళాశాలల ప్రిన్సిపాళ్ల కోటాలో ఏయూ మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆర్‌.పద్మశ్రీ, వర్సిటీ కళాశాలల అధ్యాపకుల నుంచి కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ఆచార్య ఎన్‌.చిట్టిబాబు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్ల కోటాలో నగరంలోని ఏవీఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కృష్ణకుమారి, అధ్యాపకుల కోటా నుంచి టెక్కలిలోని ఐతం ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన ఆచార్య బి.రాజేష్‌ను నియమించారు. విద్య, వైద్యం, పారిశ్రామిక, న్యాయ, సేవా రంగాల నుంచి ఆచార్య వీఎస్‌ఆర్కే ప్రసాద్‌ (ఐఐపీఎం మాజీ డైరెక్టర్‌), కేరళలోని పాలక్కాడ్‌ ఐఐటీ డైరెక్టర్‌ ఆచార్య ఎ.శేషాద్రిశేఖర్‌, కృష్ణా ఐవీఎఫ్‌కు చెందిన డాక్టర్‌ జీఏ రామరాజు, న్యాయవాది చీమలపాటి సూర్యనారాయణ శేఖర్‌ను నియమించింది.

Updated Date - Jul 31 , 2026 | 01:13 AM