Share News

కిక్కిరిస్తున్న బస్సులు

ABN , Publish Date - Mar 03 , 2026 | 01:27 AM

జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా బస్సులు లేవు.

కిక్కిరిస్తున్న బస్సులు

‘స్త్రీశక్తి’ పథకం అమలు తరువాత భారీగా పెరిగిన ప్రయాణికులు

అందుకు అనుగుణంగా పెరగని బస్సులు

రవాణాకు ఏమాతం అనుకూలంగా బస్సులు గ్యారేజీకి...

వాటి స్థానంలో కొత్తవి రాకపోవడంతో ఇబ్బందులు

ఎలక్ట్రిక్‌ బస్సులపైనే ఆశలు

ద్వారకా బస్‌స్టేషన్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా బస్సులు లేవు. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ బస్సుల సంఖ్య పెంచవలసింది పోయి తగ్గించేస్తున్నారు. జిల్లా విభజన నాటికి విశాఖ రీజియన్‌లో 804 బస్సులుండగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 74 బస్సులు తగ్గించేశారు. కూటమి అధికారం అధికారంలోకి వచ్చిన తరువాత మరో 30 బస్సులు తగ్గించారు. ప్రయాణికుల రవాణాకు ఏమాత్రం అనుగుణంగా లేని బస్సులను సెంట్రల్‌ గ్యారేజీకి పంపిస్తున్న పాలకులు...వాటి స్థానంలో కొత్తవి ఇవ్వడం లేదు. ప్రస్తుతం జిల్లాలో 700 బస్సులు సగటున ప్రతిరోజూ 4.18 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సేవలందిస్తున్నాయి. అంటే ఒక్కో బస్సు 597 మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. ఈ లెక్కలు గమనిస్తే బస్సుల్లో ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

విశాఖ రీజియన్‌లోని మధురవాడ, వాల్తేరు, విశాఖపట్నం, మద్దిలపాలెం, గాజువాక, సింహాచలం, స్టీల్‌సిటీ డిపోల నుంచి బస్సులు రాకపోకలు సాగిస్తూ రోజుకు 2.35 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. వీటి సగటు ఆక్యుపెన్సీ రేషియో 85 శాతం ఉందని అధికారులు లెక్కలు తేల్చారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అన్ని బస్సులు 130 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్నాయని తెలిపారు. ఉదయం 11 నుంచి 4 గంటల వరకు 62 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్నాయన్నారు. దాదాపుగా జిల్లాలోని అన్ని రూట్లలోను ఇదే పరిస్థితి.

పెరిగిన ప్రయాణికులు

గత ఏడాది ఆగస్టు 15 నుంచి ‘స్త్రీశక్తి’ పథకం అమలులోకి వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది. అప్పటినుంచి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. రీజియన్‌ పరిధిలో ఈ పథకానికి ముందు సగటున రోజువారీ 3.4 లక్షల మంది ప్రయాణికులు ఉండేవారు. పథకం అమలు తరువాత ఈ సంఖ్య 4.18 లక్షలకు చేరింది. స్త్రీశక్తి పథకం అమలు తరువాత 77 వేల మంది పెరిగినా అవే బస్సులు నడుస్తున్నాయి. దీంతో బస్సులన్నీ రద్దీగా ఉంటున్నాయి. స్త్రీశకి ్త పథకం వర్తించే ఆర్డినరీ, పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. ఈ బస్సుల్లో విశాఖ నుంచి పలాస, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాలకు వెళ్లే వారు నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు గొడవలు చోటుచేసుకుంటున్నాయి.

ఎలక్ట్రిక్‌ బస్సులపైనే ఆశ

విశాఖ రీజియన్‌కు 200 ఎలకి్ట్రక్‌ బస్సులు వస్తాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. గాజువాక, సింహపురి కాలనీ డిపోల నుంచి నడుపుతామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ బస్సులు వచ్చేసరికి మరో ఆరు నెలలు పడుతుందని సమాచారం. అప్పటివరకూ ప్రస్తుతం ఉన్న బస్సులే సేవలందించాల్సిన పరిస్థితి.

స్పేర్‌ బస్సులు నడుపుతున్నాం

బస్సుల సామర్థ్యానికి మించి ప్రయాణికుల డిమాండ్‌ ఉంటే స్పేర్‌లో ఉంచిన బస్సులను నడుపుతున్నాము. రీజియన్‌లో 28 స్పేర్‌ బస్సులున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వీటిని ఆపరేట్‌ చేస్తున్నాం. ఎలక్ట్రిక్‌ బస్సులు సత్వరమే పంపాలని రవాణా శాఖ, ఆర్టీసీ సెంట్రల్‌ ఆఫీస్‌ను కోరాం. అవి వస్తే ఇక్కట్లు తొలగిపోతాయి.

- బి.అప్పలనాయుడు, రీజనల్‌ మేనేజర్‌

Updated Date - Mar 03 , 2026 | 01:27 AM