Share News

మన్యంలో ముసురు

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:20 AM

మన్యంలో ముసురు వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి జల్లులు మాత్రమే పడగా, పలు మండలాల్లో ఒక మోస్తరుగా వర్షం కురిసింది.

మన్యంలో ముసురు
ముంచంగిపుట్టు మండలం బరడ పంచాయతీ బలియగూడ సమీపంలో నీట మునిగిన వరిపంట పొలాలు

ముంచంగిపుట్టులో భారీగా, పలు మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు

పాడేరు, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): మన్యంలో ముసురు వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి జల్లులు మాత్రమే పడగా, పలు మండలాల్లో ఒక మోస్తరుగా వర్షం కురిసింది. ఒడిశాకు సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లో కురిసిన వర్షానికి పంట పొలాల్లో నీరు చేరింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లోని వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాజా వాతావరణంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కొయ్యూరులో సోమవారం 30.1, పాడేరులో 25.9, అరకులోయలో 25.6, డుంబ్రిగుడలో 24.7, చింతపల్లిలో 24.5, హుకుంపేటలో 23.7, పెదబయలులో 22.8, ముంచంగిపుట్టులో 22.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అనంతగిరిలో..

అనంతగిరి: మండలంలో సోమవారం ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. మండల కేంద్రంలో సోమవారం వారపు సంత కావడంతో ముసురు కారణంగా సంతకు వచ్చేందుకు గిరిజనులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో వారపు సంత వెలవెలబోయింది.

ముంచంగిపుట్టులో..

ముంచంగిపుట్టు: మండల పరిధిలో సోమవారం కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మండల కేంద్రం నుంచి కుమడ వెళ్లే ప్రధాన రహదారిపై పలు చోట్ల గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. అదే మార్గంలో కరిముఖిపుట్టు సమీపంలో ప్రధాన రహదారిపై భారీ గుంతలో వాహనం కూరుకుపోయింది. స్థానికుల సహాయంతో ఆ వాహనాన్ని బయటకు తీసుకువచ్చారు. మండల కేంద్రం నుంచి కుమడ, సంగడ, పెదబయలు, జోలాపుట్టు, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులు చిత్తడిగా మారాయి. కిలగాడ, మాకవరం, జోలాపుట్టు, కరిముఖిపుట్టు, వనుగుమ్మ, బూసిపుట్టు, రంగబయలు, లక్ష్మీపురం, తదితర పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో పల్లపు ప్రాంతంలో ఉన్న వరిపంట పొలాలు నీట మునిగాయి. పలు చోట్ల వరదనీటి ఉధృతికి వరినారు కొట్టుకుపోయింది. అలాగే లక్ష్మీపురం, జోలాపుట్టు, రంగబయలు, బంగారుమెట్ట, తదితర పంచాయతీల పరిధిలో పలు చోట్ల వాగులు, మత్స్యగెడ్డ పాయలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

Updated Date - Aug 25 , 2026 | 12:20 AM