మన్యంలో ముసురు
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:31 AM
నైరుతి రుతుపవనాల ప్రభావంతో మన్యంలో గురువారం ముసురు వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రం మొదలుకుని అన్ని మండలాల్లోనూ ముసురు ప్రభావంతో జల్లులు, ఒక మోస్తరు వర్షం కురిసింది. ముంచంగిపుట్టు మండలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడింది. ఒనకఢిల్లీ ప్రధాన రహదారిపై అడ్డంగా భారీ వృక్షం పడడంతో మూడు గంటల సేపు ట్రాఫిక్ స్తంభించింది. తాజా వర్షాలు ఖరీఫ్ వ్యవసాయ పనులకు ఉపయోగకరంగా ఉంటాయని రైతులు అంటున్నారు. కాగా గురువారం కొయ్యూరులో 32.4, అనంతగిరిలో 28.7, చింతపల్లిలో 27.7, పాడేరులో 27.1, పెదబయలులో 25.7, ముంచంగిపుట్టులో 24.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షం
- ఒనకఢిల్లీ సమీపంలో భారీ వృక్షం విరిగిపడడంతో మూడు గంటల సేపు నిలిచిన ట్రాఫిక్
పాడేరు, జూలై 2(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల ప్రభావంతో మన్యంలో గురువారం ముసురు వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రం మొదలుకుని అన్ని మండలాల్లోనూ ముసురు ప్రభావంతో జల్లులు, ఒక మోస్తరు వర్షం కురిసింది. ముంచంగిపుట్టు మండలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడింది. ఒనకఢిల్లీ ప్రధాన రహదారిపై అడ్డంగా భారీ వృక్షం పడడంతో మూడు గంటల సేపు ట్రాఫిక్ స్తంభించింది. తాజా వర్షాలు ఖరీఫ్ వ్యవసాయ పనులకు ఉపయోగకరంగా ఉంటాయని రైతులు అంటున్నారు. కాగా గురువారం కొయ్యూరులో 32.4, అనంతగిరిలో 28.7, చింతపల్లిలో 27.7, పాడేరులో 27.1, పెదబయలులో 25.7, ముంచంగిపుట్టులో 24.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పలు మండలాల్లో..
అరకులోయ/హుకుంపేట/జి.మాడుగుల/సీలేరు: అరకులోయ మండలంలో గురువారం ముసురు వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి పలుమార్లు తేలికపాటి జల్లులు పడ్డాయి. హుకుంపేట మండలంలో గురువారం ఉదయం నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. దీంతో మట్టి రహదారులు చిత్తడిగా మారాయి. జి.మాడుగుల మండలంలో బుధవారం రాత్రి నుంచి పలు చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. గురువారం తెల్లవారుజాము నుంచి అడపాదడపా జల్లులు కురిశాయి. జీకే వీధి మండలం సీలేరులో గురువారం తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు ఒక మోస్తరు వర్షం కురిసింది. అనంతరం సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. దీంతో జనం ఉపశమనం పొందారు.
భారీ వృక్షం విరిగిపడి ట్రాఫిక్‌కు అంతరాయం
ముంచంగిపుట్టు: మండలం పరిధిలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడింది. దీంతో మండల కేంద్రం నుంచి కుమడ, జోలాపుట్టు, పెదబయలు, లక్ష్మీపురం తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులు పలు చోట్ల దెబ్బతిన్నాయి. అలాగే సరిహద్దు ప్రాంతమైన మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం సమీపంలో గల ఒనకఢిల్లీ ప్రధాన రహదారిపై అడ్డంగా భారీ వృక్షం పడింది. దీంతో మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు త్రీవ అంతరాయం ఏర్పడింది. అలాగే మూడు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వచ్చి రహదారికి అడ్డంగా ఉన్న వృక్షాన్ని తొలగించడంతో రాకపోకలు యథావిధిగా సాగాయి. విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ సరఫరాను పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు.