ఏళ్లుగా సాగి... కుప్పకూలి!
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:06 AM
దశాబ్దాల క్రితం ఉక్కు కర్మాగారానికి ముడి సరుకు రవాణా చేసేందుకు రైల్వే లైన్ నిర్మించారు.
రైల్వే ఓవర్ బ్రిడ్జికి 12 ఏళ్ల కిందట ప్రతిపాదన
వైసీపీ హయాంలో శంకుస్థాపనతో హడావుడి
నిర్మాణ లోపంతో ప్రమాదం
కాంట్రాక్టు సంస్థపై కేసు నమోదు
ఆటోనగర్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి):
దశాబ్దాల క్రితం ఉక్కు కర్మాగారానికి ముడి సరుకు రవాణా చేసేందుకు రైల్వే లైన్ నిర్మించారు. ఆటోనగర్ సమీపంలోని చుక్కవానిపాలెం రహదారి వద్ద ప్రమాదాల నివారణలో భాగంగా రైల్వే క్రాసింగ్ గేటును ఏర్పాటు చేశారు. అనంతరం ఉక్కు కర్మాగారంతో పాటు ఎన్టీపీసీ, గంగవరం పోర్టు, ఆటోనగర్‌లో అపెరల్ పార్కు, దువ్వాడలో వీఎస్‌ఈజెడ్, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. దీంతో రాకపోకలు సాగించే గూడ్స్ రైళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. పరిసర ప్రాంతాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందాయి. దీంతో రోడ్డు మార్గానికి ప్రాధాన్యం పెరిగింది. ఉత్పత్తుల తరలింపులో భాగంగా గూడ్స్ వ్యాగన్ల రాకపోకలతో రైల్వే క్రాసింగ్ గేటు అధిక సమయం మూసి ఉంటోంది. దీంతో ఆటోనగర్ పరిశ్రమలతో పాటు అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు, సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరడంతో 2012లో పనులు ప్రారంభించారు. తమ పరిధిలోని నాలుగు ప్రధాన పిల్లర్లు, మూడు స్లాబులను (సుమారు 100 మీటర్లు) రైల్వే శాఖ అధికారులు పూర్తిచేశారు. మిగిలిన పనులు చేపట్టాల్సిన ఆర్‌అండ్‌బి అధికారులు సత్వరం చర్యలు తీసుకోలేదు.
900 మీటర్లు బ్రిడ్జి...
తుంగ్లాం వద్ద సుమారు 900 మీటర్ల మేర రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించారు. రైల్వే అధికారులు 100 మీటర్ల మేర రెండేళ్లలో పనులు పూర్తిచేశారు. మిగిలిన 800 మీటర్లు (ఒక్కోవైపు 400 మీటర్లు) రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనులు చేపట్టాల్సి ఉంది. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నిర్మాణ పనులకు నోచుకోలేదు. అప్పటి మంత్రి గుడివాడఅమర్‌నాథ్, ఎంపీ విజయసాయిరెడ్డి, సేతుబంధన్ ప్రాజెక్టులో భాగంగా ఈ బ్రిడ్జి పనులకు రూ.16 కోట్లు నిధులు మంజూరుచేయించారు. ఈ క్రమంలో 2024 ఫిబ్రవరి 23న అప్పటి మంత్రి అమర్‌నాథ్ శంకుస్థాపన చేశారు. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
రైల్వే గేటుతో అవస్థలు...
తరచూ రైల్ క్రాసింగ్ గేటు మూసి ఉండడంతో కార్మికులు, విద్యార్థులు, వ్యాపారులతో పాటు సుమారు 30 గ్రామాలు ప్రజలకు ఇక్కట్లు పెరిగాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పారిశ్రామికవేత్తలు, ప్రజా ప్రతినిధులు బ్రిడ్జి నిర్మాణంపై వినతులు సమర్పించడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వం సేతుబంధన్ పథకంలో భాగంగా రూ.26 కోట్లు మంజూరు చేయించారు. దీంతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కాంక్రీట్ వేస్తుండగా ఆదివారం ఒక్కసారిగా డెకింగ్ కుప్పకూలిపోయింది. పశ్చిమబెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వందలాది మంది కార్మికులు బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్నారు. బ్రిడ్జి కుప్పకూలిపోవడంపై నిర్మాణ సంస్థ రామ్ ఎంటర్‌ప్రైజెస్‌పై కేసు నమోదుచేసినట్టు దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.