ఆర్టీసీ కాంప్లెక్స్ కిటకిట
ABN , Publish Date - Jan 09 , 2026 | 10:34 PM
సంక్రాంతి పండగ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇళ్లకు పయనమయ్యారు. శుక్రవారం సాయంత్రం నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను స్వగ్రామాలకు తీసుకువెళుతుండడంతో పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రైవేటు జీపులు, ఆటోల స్టాండ్‌లు ప్రయాణికులతో కిటకిటలాడాయి.
సెలవులతో ఇళ్లకు వెళుతున్న విద్యార్థులు
జీపు స్టాండ్‌లో సందడి
అదనపు బస్సులు నడిపిన ఆర్డీసీ
పాడేరురూరల్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇళ్లకు పయనమయ్యారు. శుక్రవారం సాయంత్రం నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను స్వగ్రామాలకు తీసుకువెళుతుండడంతో పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రైవేటు జీపులు, ఆటోల స్టాండ్‌లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. అదే విధంగా గిరిజన గ్రామాల్లో సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభం కావడంతో మైదాన ప్రాంతంలో ఉద్యోగాలు చేసేవారు, ఉపాధి కోసం వివిధ గ్రామాలకు వెళ్లిన వారు స్వగ్రామాలకు వస్తుండడంతో ఆర్టీసీ కాంప్లెక్స్ మరింత రద్దీగా మారింది. మైదాన ప్రాంతంలోని వివిధ జిల్లాలో విద్యను అభ్యసించే విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లేందుకు రావడం, అదే విధంగా పండగ బట్టలకు పాడేరు వస్త్ర దుకాణాలకు వచ్చిన వారితో కళకళలాడాయి. పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పాడేరు ఆర్టీసీ డిపో నుంచి అదనంగా ఆరు సర్వీసులను శుక్రవారం నుంచి నడుపుతున్నామని డిపో మేనేజర్ పసగాడ శ్రీనివాసరావు తెలిపారు. పాడేరు డిపో నుంచి విశాఖపట్నంకు 2, పాడేరు నుంచి చింతపల్లికి 2, పాడేరు నుంచి అరకులోయకు 2 అదనపు సర్వీసులను నడుపుతున్నామన్నారు.