Share News

సేంద్రీయ కాఫీతో ప్రపంచ స్థాయి గుర్తింపు

ABN , Publish Date - Jun 04 , 2026 | 11:17 PM

మన్యంలో కాఫీని సేంద్రీయ పద్ధతిలో పండించడం వల్లే ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందని కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు.

సేంద్రీయ కాఫీతో ప్రపంచ స్థాయి గుర్తింపు
మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిషాంతి, పక్కన టి.బాబూరావునాయుడు

కలెక్టర్‌ టి.నిషాంతి

పాడేరు, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): మన్యంలో కాఫీని సేంద్రీయ పద్ధతిలో పండించడం వల్లే ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందని కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. మండలంలోని డోకులూరు గ్రామంలో రైతు సాధికారత సంస్థ ఆధ్వర్యంలో సేంద్రీయ కాఫీ సాగుపై వివిధ శాఖల అధికారులకు గురువారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో సేంద్రీయ సాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, మార్కెట్‌లో వాటికే ఎక్కువగా డిమాండ్‌ ఉందన్నారు. ఏజెన్సీలోని కాఫీ సహజ సిద్ధంగా పండించడం వల్లే చక్కని గుర్తింపు వచ్చిందని తెలిపారు. రైతులు వివిధ ప్రాంతాల్లో సాగు విధానాలు, మార్కెటింగ్‌ పద్ధతులను అవగాహన చేసుకోవాలని, పంటన్నీ ప్రకృతి సేద్య పద్ధతుల్లో పండించాలన్నారు. కాఫీకి మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడంలో భాగంగా విక్రయదారులు, వర్తకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కాఫీ నాణ్యతను పెంచేందుకు అవసరమైన శిక్షణలు అందిస్తామని, అందుకు వ్యవసాయ అనుబంధ శాఖలు సమన్వయం చేసుకుని రైతులకు సంపూర్ణ సహకారం అందించాలని సూచించారు. అనంతరం ఆమె డోకులూరు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించి వారికి అందుతున్నసేవలపై ఆరా తీశారు. అక్కడ ఏర్పాటు చేసిన జీవ వనరుల కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికారత సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.బాబూరావునాయుడు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ ఎల్‌.భాస్కరరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, మైక్రో ఇరిగేషన్‌ పీడీ రహీమ్‌, ఐసీడీఎస్‌ పీడీ సీహెచ్‌.ఝాన్సీబాయి, స్పైసెస్‌ బోర్డు ఫీల్డ్‌ ఆపీసర్‌ బి.కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 11:17 PM