Share News

సేంద్రియ పంట.. లేదు ఎరువుల తంటా!

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:54 PM

ఖరీఫ్‌ సీజన్‌ వచ్చిందంటే ఎరువుల కోసం అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. కానీ జిల్లాలో అందుకు భిన్నమైన పరిస్థితి కొనసాగుతున్నది. గిరిజన రైతులు తరతరాలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సేంద్రియ సాగు విధానాలను పాటిస్తుండడంతో వారికి ఎరువులతో పెద్దగా పని లేకుండా పోయింది.

సేంద్రియ పంట.. లేదు ఎరువుల తంటా!
సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న వరి పంట

- గిరి రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే పంటల సాగు

- ఫలితంగా జిల్లాలో కానరాని ఎరువుల కొరత

- సేంద్రియ సాగుతో గిరిజన ఉత్పత్తులకు రెట్టింపు ఆదాయం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఖరీఫ్‌ సీజన్‌ వచ్చిందంటే ఎరువుల కోసం అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. కానీ జిల్లాలో అందుకు భిన్నమైన పరిస్థితి కొనసాగుతున్నది. గిరిజన రైతులు తరతరాలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సేంద్రియ సాగు విధానాలను పాటిస్తుండడంతో వారికి ఎరువులతో పెద్దగా పని లేకుండా పోయింది.

జిల్లాలోని పదకొండు మండలాల్లో 61 వేల 669 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 46 వేల 346 హెక్టార్లలో ఉద్యాన పంటలను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. అయినప్పటికీ ఎరువుల కొరత, వాటి కోసం అన్నదాతల ఎదురుచూపులు వంటి పరిస్థితులు మన్యంలో మచ్చుకైనా కానరావు. అలాగే సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న గిరిజన ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఏర్పడడంతో అధిక శాతం మంది రైతులు రసాయన ఎరువుల జోలికి వెళ్లడం లేదు. గిరిజనుల ఆచారం, సంప్రదాయం, పేదరికం నేపథ్యంలో అలవాటుగా మారిన ప్రకృతి వ్యవసాయం నేడు వారికి ప్రత్యేక గుర్తింపును తీసువచ్చింది.

రబీ సీజన్‌లో పంట పొలాల్లోనే పశువులు

గిరిజనులు ఎక్కువగా వర్షాధార పంటలనే సాగు చేస్తుంటారు. అందువలనే ఎక్కువగా వర్షాలు కురిసే ఖరీఫ్‌ సీజన్‌పైనే ఆధారపడుతుంటారు. ఇదే క్రమంలో రబీలో సాగునీటి కొరత, ఇతర కారణాలతో ఎక్కువగా పంటలు సాగు చేయరు. అలాగే తమ పశువులను ఖరీఫ్‌లో సాగు చేసి పంటలు కోసేసిన పొలాల్లోనే వదులుతారు. అక్కడున్న పచ్చికను పశువులు మేయడంతో పాటు అవి వేసే పేడను పంట భూముల్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. దీంతో వేసవి దుక్కి పనుల్లో పశువుల పేడ(గెత్తం) భూమిలో కలిసేలా దుక్కులు చేపడతారు. దీంతో తమ పంట భూములకు ప్రత్యేకంగా ఎరువులు వేయాల్సిన అవసరం లేకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే పంటకు అవసరమైన బలం చేకూరడంతో పాటు భూమిలో సారం దెబ్బతినకుండా ఉంటుందని రైతులు అంటున్నారు. అలాగే పలువురు రైతులు తమ పశువుల శాలకు సమీపంలోనే పశువులు, మేకల గెత్తాన్ని నిల్వ చేసి, అవసరమైనప్పుడు దానిని పంట పొలాల్లో వేసుకుంటారు. ఈ పద్ధతులను పాటించడం ద్వారా పంటల సాగు వ్యయం తగ్గడంతో పాటు సేంద్రియ పంటలు చేతికి వస్తాయని రైతులు అంటున్నారు. ఈ కారణంగానే గిరిజన రైతులు ఎక్కువగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ, రసాయన ఎరువులపై ఆసక్తి చూపడం లేదని వ్యవసాయాధికారులు అంటున్నారు.

Updated Date - Jul 14 , 2026 | 11:54 PM