Share News

ఉమ్మడి జిల్లాలో 1,000 మందికి ఓపీఎస్‌

ABN , Publish Date - Jun 25 , 2026 | 01:14 AM

రాష్ట్రంలో 2004 సెప్టెంబరుకు ముందు నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికైన, 2005 తరువాత ఉద్యోగాలు పొందిన వారికి పాత పింఛన్‌ విధానం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ఉమ్మడి జిల్లాలో సుమారు 1,000 మందికి లబ్ధి కలగనున్నది. వీరిలో సుమారు 300 మందికిపైగా ఉపాధ్యాయులు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ వల్ల సీపీఎస్‌లో ఉన్న తాము ఓపీఎస్‌కు అర్హత సాధించామని ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో   1,000 మందికి ఓపీఎస్‌

పాత పింఛన్‌ విధానం వర్తింపు

2003 డీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా

2005లో ఉద్యోగాల్లో నియమితులైన ఉపాధ్యాయులు సహా

వివిధ శాఖల్లో పలువురికి లబ్ధి

చంద్రబాబునాయుడు చొరవతోనే

సాధ్యమైందంటూ హర్షం

విశాఖపట్నం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో 2004 సెప్టెంబరుకు ముందు నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికైన, 2005 తరువాత ఉద్యోగాలు పొందిన వారికి పాత పింఛన్‌ విధానం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ఉమ్మడి జిల్లాలో సుమారు 1,000 మందికి లబ్ధి కలగనున్నది. వీరిలో సుమారు 300 మందికిపైగా ఉపాధ్యాయులు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ వల్ల సీపీఎస్‌లో ఉన్న తాము ఓపీఎస్‌కు అర్హత సాధించామని ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు 2003 అక్టోబరులో ఒక డీఎస్సీకి నోటిఫికేషన్‌ జారీచేశారు. దాని ప్రకారం 2004 ఏప్రిల్‌లో రాత పరీక్ష నిర్వహించగా, రెండు నెలల తరువాత జూన్‌లో ఫలితాలు విడుదల చేశారు. అప్పటికి సీఎంగా రాజశేఖర్‌రెడ్డి కావడంతో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాల కల్పనలో ఇబ్బందులు వచ్చాయి. దీనిపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో 2005 నవంబరులో ఉద్యోగాలు ఇచ్చారు. ఇదిలావుండగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న పాత పింఛన్‌ విధానాన్ని కేంద్రం రద్దు చేసి, 2004 సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానం (సీపీఎస్‌) తీసుకువచ్చింది. దాంతో 2004 సెప్టెంబరు ఒకటో తేదీ తరువాత ఉద్యోగాలు పొందిన ఉద్యోగులకు సీపీఎస్‌ వర్తింపజేశారు. ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్లుతోపాటు పలు శాఖల అధికారులు, ఉద్యోగులు ఈ కేటగిరీలోకి వస్తారు. అయితే 2004కు ముందు నోటిఫికేషన్ల ద్వారా ఎంపికైనప్పటికీ సీపీఎస్‌లోకి వచ్చిన ఉద్యోగులు/అధికారులు కోర్టును ఆశ్రయించారు. వారి విషయంలో, సీపీఎస్‌ ఉద్యోగుల పట్ల రాష్ట్ర విభజన తరువాత ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు సానుకూలంగా వ్యవహరించారు. ఈ క్రమంలో 2017లో సీపీఎస్‌ ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరుతోపాటు, మరణించిన సీపీఎస్‌ ఉద్యోగి కుటుంబానికి పింఛన్‌ అమలుచేశారు. ఆ తరువాత వచ్చిన జగన్మోహన్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చినా ఒకటి అమలు చేయలేదు సరికదా సీపీఎస్‌ రద్దు చేసి జీపీఎస్‌ తీసుకువస్తామని చెప్పడంతో ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. ఇదిలావుండగా 2004 సెప్టెంబరుకు ముందు నోటిఫికేషన్ల ద్వారా ఆ తరువాత ఉద్యోగాలు పొందిన వారికి పాత పింఛన్‌ విధానం అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చాలాకాలం నుంచి పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సంబంధిత అధికారులతో చర్చించి 2004 సెప్టెంబరుకు ముందు నోటిఫికేషన్‌ల ద్వారా ఎంపికైన ఉద్యోగ/ఉపాధ్యాయులకు పాత పింఛన్‌ అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మంగళవారం అధికారికంగా ప్రకటన చేయడంతో ఆ పరిఽధిలోకి వచ్చే ఉద్యోగ/ఉపాధ్యాయులు, అధికారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

చంద్రబాబునాయుడు వల్లే సాధ్యమైంది

జకీర్‌ ఆలీ, కన్వీనర్‌, 2003 డీఎస్సీ ఫోరం

2003లో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికై 2005లో ఉద్యోగం పొందిన మేము పాత పింఛన్‌ విధానానికి అర్హులమని రెండు దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు ఓపీఎస్‌ అమలుచేయడం ద్వారా మా కుటుంబాలకు చంద్రబాబునాయుడు ఎంతో మేలు చేశారు. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు.

సీఎంకు కృతజ్ఞతలు

ఇ.పైడిరాజు, ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ, విశాఖ జిల్లా

2004 సెప్టెంబరుకు ముందు విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పింఛన్‌ విధానం అమలు చేయడంతో ఆయా వర్గాలకు ఎంతో ప్రయోజనం కలిగింది. ఓపీఎస్‌ అమలు చేయాలని ఎస్టీయూ సంఘం మిగిలిన ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పోరాటం చేసింది. తెలంగాణ హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినా అక్కడ పాలకులు మాత్రం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేశారు. ఏపీలో మాత్రం సీఎం చంద్రబాబునాయుడు సానుకూలంగా ఉండడం వల్ల ఓపీఎస్‌ అమలుచేసింది. ఆయా కుటుంబాలకు ఎంతో మేలు జరిగింది. వారి తరపున సీఎంకు కృతజ్ఞతలు.

Updated Date - Jun 25 , 2026 | 01:14 AM