Share News

రుషికొండ ప్యాలెస్‌ సందర్శనకు అవకాశం

ABN , Publish Date - Nov 29 , 2026 | 01:15 AM

రుషికొండపై భారీ వ్యయంతో నిర్మించిన ప్యాలెస్‌ను ప్రైవేటు నిర్వహణకు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

రుషికొండ ప్యాలెస్‌ సందర్శనకు అవకాశం

నాలుగు నెలలు ప్రజలకు అనుమతి

ఆ తరువాత ప్రైవేటుకు అప్పగింత

హెరిటేజ్‌, కల్చరల్‌ సెంటర్‌ ఏర్పాటు

ప్రతిపాదన ప్రకటనలకే పరిమితం

కొండపై అదనంగా మరిన్ని గదుల నిర్మాణం?

విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):

రుషికొండపై భారీ వ్యయంతో నిర్మించిన ప్యాలెస్‌ను ప్రైవేటు నిర్వహణకు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ అప్పగింత ప్రక్రియ పూర్తయ్యేలోపు సుమారు నాలుగు నెలలు ఆ భవనాన్ని ప్రజా సందర్శనకు అనుమతించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు.

వైసీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రుషికొండపై హరిత రిసార్ట్స్‌ను కూలగొట్టి పర్యాటక భవనం పేరుతో రూ.452 కోట్లు వెచ్చించి అత్యంత ఖరీదైన ప్యాలెస్‌ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణం కోసం పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారు. కొండను ఇష్టానుసారం తవ్వేశారు. వీటిపై ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, రఘురామకృష్ణంరాజు, పీతల మూర్తియాదవ్‌లు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు హైకోర్టులో నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రధాన నాయకులంతా భవనాన్ని సందర్శించారు. దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే నిర్ణయం తీసుకోవడానికి ముగ్గురు మంత్రులతో సబ్‌ కమిటీ ఏర్పాటుచేశారు. వారు గత జూన్‌లో వచ్చి భవనం చూసి నివేదిక తయారుచేశారు. దానిని సమర్పించడంలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఆ నివేదికపై విజవాయడలో శుక్రవారం సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆతిథ్య రంగంలోనే ఆ భవనాన్ని ఉపయోగించుకోవాలని, ఎవరు ఎక్కువ ఆదాయం ఇస్తారో వారికే దానిని అప్పగించాలని నిర్ణయించారు. ఆ భవనంతో పాటు అక్కడ ఖాళీగా ఉన్న తొమ్మిది ఎకరాల భూమి, పైన మరో 2,400 చ.మీ. ఖాళీ స్థలాలు కూడా ఇవ్వాలని కమిటీ సిఫారసు చేసింది. ఆ కొండపై పర్యాటకులు బస చేసేందుకు అదనపు గదులు నిర్మించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఉన్న భవనాల్లో ఒక దానిని కల్చర్‌, హెరిటేజ్‌ సెంటర్‌గా ఉపయోగించుకునేలా సిఫారసు చేస్తామని సబ్‌ కమిటీ విశాఖ సమావేశంలో అప్పుడు వెల్లడించింది. కానీ తాజాగా శుక్రవారం జరిగిన సమావేశంలో ఆ అంశం ప్రస్తావనకు రాలేదు. అంటే మొత్తం భవనం ప్రైవేటు సంస్థలకే ఇస్తారని అర్థమవుతోంది. మొత్తం తొమ్మిది సంస్థలు భవనం లీజుకు బిడ్లు వేశాయి.

Updated Date - Nov 29 , 2026 | 01:15 AM