ఆపరేషన్ వజ్ర ప్రహార్
ABN , Publish Date - Mar 12 , 2026 | 01:26 AM
గంజాయి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా పోలీసులు బుధవారం తెల్లవారుజామున ‘ఆపరేషన్ వజ్ర ప్రహార్’ పేరుతో నర్సీపట్నం, గొలుగొండ మండలాల సరిహద్దులోని నీలంపేట, అయ్యన్నపాలెం జంక్షన్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
అయ్యన్నకాలనీ, నీలంపేటల్లో పోలీసుల కార్డెన్ సెర్చ్
రికార్డులు లేని 35 ద్విచక్ర వాహనాలు, ఒక కారు సీజ్
రౌడీషీటర్ ఇంట్లో భారీ కత్తి స్వాధీనం
గంజాయి కేసులో తప్పించుకుతిరుగుతున్న నిందితుడి అరెస్టు
నర్సీపట్నం/ గొలుగొండ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):
గంజాయి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా పోలీసులు బుధవారం తెల్లవారుజామున ‘ఆపరేషన్ వజ్ర ప్రహార్’ పేరుతో నర్సీపట్నం, గొలుగొండ మండలాల సరిహద్దులోని నీలంపేట, అయ్యన్నపాలెం జంక్షన్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ పోతురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నర్సీపట్నం పట్టణ, రూరల్, గొలుగొండ స్టేషన్లకు చెందిన పది మంది పోలీసులు అధికారులు, 74 మంది సిబ్బంది కలిసి కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సుమారు 200 ఇళ్లల్లో సోదాలు నిర్వహించి, 250 మందిని విచారించారు. రికార్డులు లేని 35 ద్విచక్ర వాహనాలను, ఒక కారును సీజ్ చేశారు. గంజాయి కేసుల్లో పాత నేరస్థుడు, రౌడీషీటర్ అయిన రుత్తల బోడకొండ అలియాస్ నాని ఇంట్లో పెద్ద కత్తితోపాటు కోడి పందేలకు వినియోగించే కత్తులను స్వాధీనం చేసుకున్నారు. మాకవరపాలెం పోలీస్ స్టేషన్‌లో నమోదైన 370 కిలోల గంజాయి కేసులో తప్పించుకు తిరుగుతున్న మొదటి నిందితుడు జి.కుమారస్వామిని అయ్యన్న కాలనీలో అరెస్టు చేశారు. ఎక్కడైనా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం జరుగుతుంటే 1972 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శ్రీనివాసరావు కోరారు.