ఓపెన్‌గా... చెత్త తరలింపు
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:42 AM
జీవీఎంసీ పరిధిలో పోగవుతున్న చెత్తను పర్యావరణానికి హాని లేకుండా శాస్త్రీయంగా పునర్వినియోగించాలనే ఆశయానికి అధికారుల నిర్లక్ష్యం అవరోధంగా మారింది.
మూలకుచేరిన గాజువాక, టౌన్ కొత్తరోడ్డు క్లోజ్డ్ కాంపాక్టర్ సిస్టమ్ ప్రాజెక్టులు
ఆరు నెలలుగా కొనసా...గుతున్న మరమ్మతులు
నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి టార్పాలిన్లు కప్పకుండా టిప్పర్లలో చెత్త కాపులుప్పాడ తరలింపు
గాలికి ఎగిరి రహదారులపై పడుతున్న చెత్త
ఒక్కొక్కసారి వెనుకవచ్చే వాహన చోదకుల కళ్లలో పడడంతో ప్రమాదాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ పరిధిలో పోగవుతున్న చెత్తను పర్యావరణానికి హాని లేకుండా శాస్త్రీయంగా పునర్వినియోగించాలనే ఆశయానికి అధికారుల నిర్లక్ష్యం అవరోధంగా మారింది. జోన్‌ల వారీగా చెత్తను సేకరించే క్లాప్ వాహనాలు గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ (జీటీఎస్)లకు, అక్కడి నుంచి కంటెయినర్‌ల ద్వారా కాపులుప్పాడలోని డంపింగ్‌యార్డుకు తరలించేందుకు క్లోజ్డ్ కాంపాక్టర్ సిస్టమ్ (సీసీఎస్) అందుబాటులోకి తెచ్చారు. అయితే గాజువాక, టౌన్‌కొత్తరోడ్డులోని ఈ సీసీఎస్ ప్రాజెక్టులు మరమ్మతులకు గురవడంతో చెత్తను ఓపెన్ టిప్పర్లతో కాపులుప్పాడ తరలిస్తున్నారు. ఫలితంగా పర్యావరణ సమస్య తలెత్తడంతో పాటు చెత్త ఎగిరి వాహన చోదకులపై పడుతుండడంతో ప్రమాదాలకు గురవుతున్నారు.
జీవీఎంసీ పరిధిలోని నివాసాలు, వాణిజ్య కేంద్రాల నుంచి ప్రతిరోజూ 1,100 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇంటింటికీ వెళ్లి క్లాప్ వాహనాలు చెత్తను సేకరించి, సమీపంలోని జీటీఎస్ కేంద్రాల్లో డంపింగ్ చేస్తాయి. అక్కడి నుంచి గతంలో ఓపెన్ టిప్పర్ల ద్వారా కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలించేవారు. దీనివల్ల చెత్త గాలికి ఎగిరి టిప్పర్ వెనుక వచ్చే వాహన చోదకులపై పడడంతో ప్రమాదాలు సంభవిస్తుండేవి. రహదారులు కూడా అపరిశుభ్రంగా మారేవి. మరోవైపు తీవ్రమైన దుర్గంధం వెదజల్లడంతో వాయు కాలుష్యం పెరిగి, పర్యావరణ సమస్యలు తలెత్తేవి. ఈ నేపథ్యంలో చెత్తను శాస్త్రీయంగా డంపింగ్ యార్డుకు తరలించడంతోపాటు పునర్వినియోగానికి వీలుగా జీవీఎంసీ ప్లాంట్లు ఏర్పాటుచేసింది. జీటీఎస్ కేంద్రాలకు చేరిన చెత్తను కంటెయినర్ మాదిరిగా ఉండే హుక్ లోడర్ల ద్వారా కాపులుప్పాడ తరలించేలా సీసీఎస్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చారు.
రూ.10 కోట్ల ఖర్చుతో...
గాజువాక, టౌన్‌కొత్తరోడ్డు, ముడసర్లోవ, చీమలాపల్లి, భీమిలి జోన్‌లలో సగటున రూ.రెండు కోట్లు వెచ్చించి సీసీఎస్ ప్రాజెక్టులను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా గల్లా పెట్టె మాదిరిగా ఉండే యంత్రాల్లోకి చెత్తను క్లాప్ వాహనాలు డంప్ చేస్తే, అవి బాగా కంప్రెస్ చేసి కేక్‌లా మార్చి హుక్‌లోడర్ కంటెయినర్‌లోకి పడేస్తాయి. హుక్‌లోడర్‌తో కాపులుప్పాడ తరలిస్తారు. దీనివల్ల రోడ్డుపై వాహనం వెళుతున్నప్పుడు దుర్గంధం వెలువడదు. అలాగే గాలికి ఎగిరి వెనుకవచ్చే వాహనాలపై పడడం, ప్రమాదాలు చోటుచేసుకోవడం వంటివి జరగవు. పర్యావరణహితంగా చెత్త తరలింపు ప్రక్రియ జరుగుతోంది.
సాగుతున్న మరమ్మతులు
గాజువాక, టౌన్‌కొత్తరోడ్డుల్లోని గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లలో సీసీఎస్ ప్రాజెక్టులు ఆరు నెలల కిందట మరమ్మతులకు గురయ్యాయి. వాటి నిర్వహణ చూడాల్సిన కాంట్రాక్టర్‌లు జీవీఎంసీ నుంచి ఎప్పటికప్పుడు బిల్లులు తీసుకుంటూ ప్రాజెక్టులను గాలికి వదిలేయడంతో యంత్రాలన్నీ మూలకు చేరాయి.
హుక్‌లోడర్లు పనిచేయకపోయినప్పటికీ వాటితో చెత్త తరలించినట్టు రికార్డుల్లో చూపించి జీవీఎంసీ నుంచి డీజిల్ తీసుకున్నారు. కమిషనర్ కేతన్‌గార్గ్ ఆకస్మికంగా తనిఖీ చేయడంతో సుమారు రూ.50 లక్షల అవినీతి జరిగినట్టు గుర్తించి కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయించారు. ఆ తర్వాత సదరు కాంట్రాక్టర్ తప్పుకోవడంతో టౌన్‌కొత్తరోడ్డు, గాజువాక సీసీఎస్ ప్రాజెక్టులకు దాదాపు రూ.1.5 కోట్లతో మరమ్మతులు ప్రారంభించారు. ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో అధికారులు అద్దె ప్రాతిపదికన ఓపెన్ టిప్పర్లతో చెత్తను కాపులుప్పాడ తరలిస్తున్నారు. అయితే చెత్త గాలికి ఎగరకుండా కచ్చితంగా టార్పాలిన్ లేదా వలతో కప్పాలనే నిబంధన ఉంది. కానీ అవేవీ లేకుండా టిప్పర్లతో ఇష్టారాజ్యంగా చెత్తను తరలిస్తున్నారు.
మరోవైపు స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో ఉత్తమర్యాంకు దక్కాలంటే సీసీఎస్ ప్రాజెక్టులను త్వరగా అందుబాటులోకి తీసుకురాలనే స్పృహ లేకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎంత పెద్ద రిపేరు అయినా గరిష్ఠంగా నెల రోజుల్లో పూర్తిచేసే అవకాశం ఉంటుందని, కానీ ఆరు నెలలుగా సీసీఎస్ ప్రాజెక్టుల మరమ్మతుల పేరుతో ఓపెన్ టిప్పర్లతో చెత్త తరలిస్తున్నారని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. పైగా టిప్పర్లకు అద్దె చెల్లింపులో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించాలని కోరుతున్నారు.