Share News

ఇంకా రెండు రోజులే!

ABN , Publish Date - Aug 14 , 2026 | 12:57 AM

జిల్లాలో ఫసల్‌ బీమా యోజన ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంటకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ఈనెల 15వ తేదీతో గడువు ముగియనుండగా.. ఇప్పటివరకు నిర్దేశించిన లక్ష్యంలో సగం కూడా పూర్తికాలేదు. రైతులు బీమా ప్రీమియం చెల్లించేందుకు కామన్‌ సర్వీస్‌ సెంటర్లకు (ఈ-సేవా కేంద్రాలు) వెళుతున్నప్పటికీ సాంకేతిక అవరోధాలు, సర్వర్‌ డౌన్‌ కావడంతో వంటి సమస్యలతో చెల్లింపులకు ఆటంకం ఏర్పడుతున్నది.

ఇంకా రెండు రోజులే!
బుచ్చెయ్యపేట ఈ-సేవా కేంద్రంలో వరి పంట బీమా నమోదును పరిశీలిస్తున్న మండల వ్యవసాయ అధికారి నారాయణరావు (ఎడమవైపు వ్యక్తి)

వరి పంట బీమా నమోదుకు రేపటితో ముగియనున్న గడువు

వర్షాభావ పరిస్థితులతో నత్తనడక

46 శాతం విస్తీర్ణానికే ప్రీమియం చెల్లింపు

లక్ష్యం 53,219 హెక్టార్లు... ఇప్పటివరకు పూర్తయ్యింది 24,404 హెక్టార్లు

99.6 శాతంతో నక్కపల్లి టాప్‌

18 శాతంతో అట్టడుగున నాతవరం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఫసల్‌ బీమా యోజన ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంటకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ఈనెల 15వ తేదీతో గడువు ముగియనుండగా.. ఇప్పటివరకు నిర్దేశించిన లక్ష్యంలో సగం కూడా పూర్తికాలేదు. రైతులు బీమా ప్రీమియం చెల్లించేందుకు కామన్‌ సర్వీస్‌ సెంటర్లకు (ఈ-సేవా కేంద్రాలు) వెళుతున్నప్పటికీ సాంకేతిక అవరోధాలు, సర్వర్‌ డౌన్‌ కావడంతో వంటి సమస్యలతో చెల్లింపులకు ఆటంకం ఏర్పడుతున్నది.

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంటకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఫసల్‌ బీమా యోజనను అమలు చేస్తున్నది. రైతులు తమ వాటా ప్రీమియం కింద రూ.84 చెల్లిస్తే సరిపోతుంది. వర్షాభావం, వరదలు, తుఫాన్లు, తెగుళ్లు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల వరి పంటకు నష్టం వాటిల్లితే గరిష్ఠంగా రూ.42,492 అందుతుంది. ఈ సొమ్ము సంబంధిత బీమా కంపెనీ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. సొంత భూములు వున్న రైతులతోపాటు కౌలు రైతులు కూడా నిబంధనల ప్రకారం అర్హులే. వరి సాగు చేసే రైతులు పంట బీమా నమోదుకు ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతాకు అనుసంధానం అయిన మొబైల్‌ నంబరుతో సమీపంలోని మీ-సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలి. ఇంతవరకు వరి నాట్లు వేయని రైతులు కూడా బీమా చేసుకోవచ్చు. కౌలు రైతులు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కౌలు/సాగు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వరినాట్లు వేసి, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వాటిల్లితే బీయా నిబంధనల ప్రకారం పరిహారం అందుతుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది సుమారు నెలన్నర నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. వరి పంటకు బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, కనీసం వరినారుమళ్లు పోయడానికి వీలుకాలేదు. దీంతో పలువురు రైతులు ఇంకా బీమా చేయించుకోలేదు. ఇటువంటి వారు ఈనెల 15వ తేదీలోగా తప్పకుండా బీమా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు.

వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 53,219 వరి సాగు అవుతుందని అంచనా. బీమా ప్రీమియం చెల్లించడానికి మరో రెండు రోజులే గడువు వుండగా.. 13వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు 24,404 హెక్టార్లకు (45.85 శాతం) మాత్రమే బీమా నమోదైంది. శనివారంనాటికి 28,815 హెక్టార్లకు బీమా చేయాల్సి ఉంది. రెండు రోజుల్లో శత శాతం నమోదు చేయడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. ఈ-సేవా కేంద్రాల్లో సాంకేతిక అవరోధాలు, సర్వర్‌ డౌన్‌ వంటి సమస్యలతో రైతుల వివరాలను అప్‌లోడ్‌ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. కొన్నిచోట్ల దరఖాస్తు ఆప్‌లోడ్‌ పూర్తయినప్పటికీ.. ప్రీమియం చెల్లింపు నమోదు కాకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొస్తున్నది.

మొదటి స్థానంలో నక్కపల్లి

వరి పంట బీమా నమోదులో 99.6 శాతంతో నక్కపల్లి మండలం మొదటి స్థానంలో వుండగా, 18 శాతం నమోదుతో నాతవరం మండలం అట్టడుగున వుంది. రోలుగుంటలో 87.7 శాతం, చీడికాడలో 69.4 శాతం, రావికమతంలో 65.4 శాతం, కె.కోటపాడులో 62.3 శాతం బీమా నమోదుతో మెరుగ్గా వున్నాయి. ఇక జిల్లా సగటుకన్నా తక్కువగా.. నర్సీపట్నం 28.6 శాతం, దేవరాపల్లిల 33.5, మునగపాక 33.6, గొలుగొండ 34.7, కోటవురట్ల 36.7, అనకాపల్లి 43.2 శాతంతో ఉన్నాయి.

Updated Date - Aug 14 , 2026 | 12:57 AM