Share News

కొనేవారే కరువాయే!

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:57 AM

టమాటా ధరలు మరింత తగ్గిపోయాయి. మార్కెట్లకు తీసుకొచ్చిన టమాటాలను కొనుగోలు చేసే వారే కరువయ్యారు. దేవరాపల్లి, కృష్ణాదేవిపేట మార్కెట్‌లలో మంగళవారం సుమారు 30 కిలోలు బరువుండే క్రేట్‌ టమాటాలు రూ.50కి మించి ధర పలకలేదు. ఈ రేటు ప్రకారం కిలో రెండు రూపాయలు కూడా రైతుకు దక్కలేదు. రవాణా చార్జీలు, మార్కెట్‌ ఆశీలు కూడా రావని ఆవేదన వ్యక్తం చేశారు.

కొనేవారే కరువాయే!
దేవరాపల్లి మార్కెట్‌లో టమాటా క్రేట్లతో కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్న రైతులు

మరింత తగ్గిపోయిన టమాటా ధర

దేవరాపల్లి, కృష్ణాదేవిపేట మార్కెట్‌లలో కిలో రూ.2

30 కిలోల క్రేట్‌ టమాటాలు రూ.60కి మించి అమ్ముడుపోని దుస్థితి

కొనుగోలుదారుల కోసం మధ్యాహ్నం వరకు నిరీక్షణ

అయినా అమ్ముడుపోకపోవడంతో ఇళ్లకు తీసుకెళ్లిపోయిన రైతులు

రవాణా చార్జీలు, మార్కెట్‌ ఆశీలు కూడా రావని ఆవేదన

దేవరాపల్లి/ కృష్ణాదేవిపేట, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): టమాటా ధరలు మరింత తగ్గిపోయాయి. మార్కెట్లకు తీసుకొచ్చిన టమాటాలను కొనుగోలు చేసే వారే కరువయ్యారు. దేవరాపల్లి, కృష్ణాదేవిపేట మార్కెట్‌లలో మంగళవారం సుమారు 30 కిలోలు బరువుండే క్రేట్‌ టమాటాలు రూ.50కి మించి ధర పలకలేదు. ఈ రేటు ప్రకారం కిలో రెండు రూపాయలు కూడా రైతుకు దక్కలేదు. రవాణా చార్జీలు, మార్కెట్‌ ఆశీలు కూడా రావని ఆవేదన వ్యక్తం చేశారు.

దేవరాపల్లి మార్కెట్‌కు చుట్టుపక్కల గ్రామాల రైతులు మంగళవారం సుమారు 40 టన్నుల టమాటాలను తీసుకొచ్చారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా టమాటా పంట చేతికి రావడంతో దేవరాపల్లి మార్కెట్‌లో రైతుల నుంచి కొనుగోలు చేయడానికి వ్యాపారులు అంతగా రాలేదు. దీంతో సుమారు 30 కిలోలు వుండే క్రేట్‌ టమాటాలు రూ.50కి మించి ధర పలకలేదు. కొద్దిసేపటి తరువాత కొనుగోలుదారులు తగ్గిపోవడంతో ఆందోళన చెందిన రైతులు.. క్రేట్‌ టమాటాలు రూ.40కి తగ్గించి విక్రయించాల్సి వచ్చింది. టమాటాలను తేవడానికి రవాణా చార్జీలు, మార్కెట్‌ ఆశీలుకు ఈ డబ్బులు సరిపోయాయని, ఉత్తి చేతులతో ఇళ్లకు వెళుతున్నామని పలువురు రైతులు వాపోయారు. టమాటాలు పూర్తిగా అమ్ముడుపోని కొంతమంది రైతులు మార్కెట్‌లోనే పారబోసి వెళ్లగా, మరికొందరు రైతులు ఊళ్లో ఉచితంగా ఇచ్చేస్తామంటూ తిరిగి ఇళ్లకు తీసుకుపోయారు.

గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట మార్కెట్‌లో క్రేట్‌ టమాటాలు రూ.50-60 మాత్రమే ధర పలికాయి. రెండు రోజుల నుంచి ఇదే పరిస్థితి వుండడంతో మంగళవారం నర్సీపట్నం ఏఎంసీ చైర్మన్‌ గవిరెడ్డి వెంకటరమణ ఇక్కడికి వచ్చి, రైతులు తెచ్చిన టమాటాలను పరిశీలించారు. క్రేటు రూ.50కి మించి ధర పకలడం లేదని తెలుసుకొని నర్సీపట్నం హోటల్‌ వ్యాపారులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. క్రేటు టమాటాలు రూ.100కు కొనుగోలు చేసేలా వ్యాపారులను ఒప్పించారు. అనంతరం రైతుల నుంచి టమాటాలను కొనుగోలు చేసి, నర్సీపట్నం తరలించారు. ఆయన వెంట మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు సలాదుల దేవీప్రసాద్‌, యక్కల కమలాంబిక, కూటమి నాయకులు సలాదులు ప్రసాద్‌, రామకృష్ణ, తాతాజీ వున్నారు.

మాకవరపాలెంలో...

మాకవరపాలెం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని సంతలో మంగళవారం కిలో టమాటా రూ.3కు పడిపోవడంతో రైతులు తీవ్రదిగాలు చెందారు. మెట్ట ప్రాంతాలైన జి.వెంకటాపురం, నగరం, జి.కోడూరు, ఎరకన్నపాలెం, పాపయ్యపాలెం, బూరుగుపాలెం, పెద్దిపాలెం, తూటిపాల గ్రామాల్లో రబీ పంటగా టమాటా సాగు చేశారు. కొద్ది రోజుల నుంచి దిగుబడి వస్తుండడంతో మాకవరపాలెం సంతకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు పెద్దగా రాకపోవడంతో క్రేట్‌ టమాటాలు (సుమారు 30 కిలోలు) రూ.100 నుంచి రూ.120 మాత్రమే ధర పలికాయి. అయినప్పటికీ పూర్తిగా అమ్ముడుపోకపోవడంతో కొంతమంది మంది రైతులు మార్కెట్‌ ఆశీలు రుసుముకు బదులు టమాటాలు వదిలి వెళ్లారు.

Updated Date - Mar 04 , 2026 | 12:57 AM