నూతన పోలీసు కానిస్టేబుళ్లకు ఎన్‌డీపీఎస్ చట్టంపై ఆన్‌లైన్‌లో శిక్షణ
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:46 PM
రాష్ట్రంలో కొత్తగా నియమితులైన ఆరు వేల మంది పోలీసు కానిస్టేబుళ్లకు నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్టు-1985 (ఎన్‌డీపీఎస్ చట్టం)పై ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చేందుకు దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంతో విజయనగరంలోని పోలీసు శిక్షణ కళాశాల మంగళవారం ఒప్పందం కుదుర్చుకొందని ఉప కులపతి ప్రొఫెసర్ డి.సూర్యప్రకాశరావు తెలిపారు.
న్యాయ విశ్వవిద్యాలయంతో పోలీసు శాఖ ఎంఓయూ
సబ్బవరం, ఫిబ్రవరి 3 (ఆంద్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా నియమితులైన ఆరు వేల మంది పోలీసు కానిస్టేబుళ్లకు నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్టు-1985 (ఎన్‌డీపీఎస్ చట్టం)పై ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చేందుకు దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంతో విజయనగరంలోని పోలీసు శిక్షణ కళాశాల మంగళవారం ఒప్పందం కుదుర్చుకొందని ఉప కులపతి ప్రొఫెసర్ డి.సూర్యప్రకాశరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతనంగా ఎంపికైన సివిల్, ఏఆర్ పోలీసు కానిస్టేబుళ్లకు రాష్ట్రంలోని నాలుగు 4 పోలీసు శిక్షణ కళాశాలలు, ఐదు బెటాలియన్లు, తొమ్మిది పోలీసుల శిక్షణ కేంద్రాల్లో గత ఏడాది డిసెంబరు 22 నుంచి శిక్షణ కార్యక్రమం ప్రారంభం అయ్యిందన్నారు. ఇందులో భాగంగా ఎన్‌డీపీఎస్ యాక్టుపై డీఎస్‌ఎన్‌ఎల్‌యూ ద్వారా ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసు విభాగం తరపున విజయనగరం పోలీసు శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ డి.రామచంద్రరాజుతో ఒప్పంద పత్రాలు మార్చుకొన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ విశ్వచంద్ర మాదాసు, అధ్యాపకులు భవానీప్రసాద్ పండా, దయానందమూర్తి, తదితరులు పాల్గొన్నారు.