కొనసాగుతున్న దివ్యాంగుల వీల్‌చైర్ క్రికెట్ పోటీలు
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:17 AM
మండలంలోని గుల్లేపల్లిలో జరుగుతున్న 5వ జాతీయ దివ్యాంగుల వీల్‌చైర్ క్రికెట్ టోర్నమెంట్ రెండవ రోజైన మంగళవారం మ్యాచ్‌ల్లో ఏపీ, తెలంగాణ జట్లు విజేతగా నిలిచాయి.
రెండో రోజు మ్యాచ్‌ల్లో విజేతలు ఏపీ, తెలంగాణ
సబ్బవరం, ఫిబ్రవరి 24 (ఆంద్రజ్యోతి): మండలంలోని గుల్లేపల్లిలో జరుగుతున్న 5వ జాతీయ దివ్యాంగుల వీల్‌చైర్ క్రికెట్ టోర్నమెంట్ రెండవ రోజైన మంగళవారం మ్యాచ్‌ల్లో ఏపీ, తెలంగాణ జట్లు విజేతగా నిలిచాయి. ఛత్తీస్‌గఢ్‌పై టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ జట్టు 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. కేవటి శ్రీను 42 బంతుల్లో 82 పరుగులు, ప్రకృద్దీన్ 39 బంతుల్లో 52 పరుగులు, సంతోశ్ 30 బంతుల్లో 34 పరుగులు చేసి భారీ స్కోర్‌కు దోహదపడ్డారు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఛత్తీస్‌గఢ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ కోల్పోయి 155 పరుగులు సాధించింది. దీంతో ఏపీ జట్టు 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఏపీ జట్టు విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్‌గా శీను నిలిచాడు. మరో మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన తెలంగాణ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఒడిశా జట్టుపై 282 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఒడిశా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. దీంతో తెలంగాణ జట్టు ఘన విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా షేక్ మోను నిలిచారు. విజేతలకు ఏసీఏ దివ్యాంగుల కమిటీ చైర్మన్ రామన్ సుబ్బారావు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల కమిటీ కార్యదర్శి ఎడ్లపల్లి సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఎంవీ రమణ, సంయుక్త కార్యదర్శి ఏసుబాబు, కె.దినేశ్‌విహార్ తదితరులు పాల్గొన్నారు.