Share News

కొనసాగుతున్న వర్షాలు

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:26 AM

మన్యంలో ముందస్తు వర్షాలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రం మొదలుకుని దాదాపుగా అన్ని మండలాల్లోనూ బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండ కాసింది.

కొనసాగుతున్న వర్షాలు
చింతపల్లిలో వర్షం

మధ్యాహ్నం వరకు ఎండ.. ఆ తరువాత వాన

పాడేరు, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): మన్యంలో ముందస్తు వర్షాలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రం మొదలుకుని దాదాపుగా అన్ని మండలాల్లోనూ బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండ కాసింది. ఆ తరువాత నుంచి వాతావరణం మారిపోయి ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. కొయ్యూరు, అరకులోయలో 36.8, పాడేరు, జీకేవీధి, డుంబ్రిగుడలో 36.6, చింతపల్లిలో 33.9, అనంతగిరిలో 33.5, జి.మాడుగులలో 33.4, ముంచంగిపుట్టులో 32.1, పెదబయలులో 32.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చింతపల్లిలో..

చింతపల్లి: మండల కేంద్రంలో కుండపోత వర్షం పడింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండున్నర గంటల వరకు భారీ వర్షం కురిసింది. వర్షానికి ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు, కాలువలు, పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది. వర్షం వల్ల వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. కాగా ఈ వర్షాలు ఖరీఫ్‌ సాగుకు అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అనంతగిరిలో..

అనంతగిరి: మండలంలోని కాశీపట్నం, డముకు, కొండిబ, అనంతగిరి, తైడ, తదితర గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో ఘాట్‌రోడ్డులో వరదనీరు పోటెత్తింది. భారీ వర్షం వలన గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

Updated Date - Jun 04 , 2026 | 12:26 AM