కొనసాగుతున్న ప్రయాణికుల రద్దీ
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:11 PM
దసరాకు విద్యార్థులు, ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న వారు స్వగ్రామాలకు తరలివెళుతుండడంతో పాడేరులోని ఆర్టీసీ కాంప్లెక్స్, ఆటో, జీపు స్టాండులు కిటకిటలాడుతున్నాయి.
దసరా సెలవులతో స్వగ్రామాలకు వెళుతున్న విద్యార్థులు
కిటకిటలాడుతున్న ఆర్టీసీ కాంప్లెక్సు, ఆటో, జీపు స్టాండులు
అదనపు బస్సులను నడుపుతున్న ఆర్టీసీ
పాడేరురూరల్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): దసరాకు విద్యార్థులు, ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న వారు స్వగ్రామాలకు తరలివెళుతుండడంతో పాడేరులోని ఆర్టీసీ కాంప్లెక్స్, ఆటో, జీపు స్టాండులు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన ఈ సందడి శనివారం కూడా కొనసాగింది. పాడేరులోని గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఏపీఆర్ గురుకుల కళాశాలల్లోని విద్యార్థులను తీసుకువెళ్లేందుకు శనివారం అధిక సంఖ్యలో తల్లిదండ్రులు చేరుకున్నారు. ఏపీఆర్ జూనియర్ కళాశాలలో రిజిస్టర్‌లో సంతకాలు చేసేందుకు తల్లిదండ్రులు బారులు తీరారు. అదేవిధంగా మైదాన ప్రాంతంలోని విశాఖపట్నం, అనకాపల్లి, చోడవరం, పాయకరావుపేట తదితర ప్రాంతాల్లో చదువుకుంటున్న గిరిజన ప్రాంత విద్యార్థులు దసరా సెలవులకు ఇంటిబాట పట్టడంతో పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్, జీపు, ఆటో స్టాండ్‌లు రద్దీగా మారాయి. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు, పనులకు వెళ్లిన వారంతా దసరా పండుగకు స్వగ్రామాలకు వస్తున్నారు. అలాగే రోజూవారీ ప్రయాణికులతో పాడేరు పట్టణం రద్దీగా మారింది. ఈ రద్దీ ఆదివారం కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైన రూట్‌లలో అదనపు బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ ఎంఎస్‌ఎస్.నాయుడు తెలిపారు.