Share News

కొనసా..గుతున్న దర్యాప్తు

ABN , Publish Date - Feb 13 , 2026 | 01:00 AM

కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధి విస్సన్నపేటలో సాగిన భూ దోపిడీపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ నత్తనడకన సాగుతోందా?.. అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఏడాదిన్నర దాటినా విచారణ పూర్తికాకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. మరోవైపు అనుమతులు లేని లేఅవుట్‌లో రహదారుల నిర్మాణం, విద్యుత్‌ లైన్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

కొనసా..గుతున్న దర్యాప్తు
బయ్యవరం సర్వే నంబరు 624లో 5.39 ఎకరాలను ఆక్రమించి లేఅవుట్‌కు నిర్మించిన రహదారిపై రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు

విస్సన్నపేట భూ దందాపై ఏడాదిన్నర దాటినా పూర్తికాని విజిలెన్స్‌ విచారణ

గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా లేఅవుట్‌

డి.పట్టాదారులు, ఇనాం సాగుదారుల నుంచి బలవంతంగా భూములు కొనుగోలు

వాగులు, గెడ్డలు పూడ్చివేత

తెరవెనుక వైసీపీ నేతలు, అప్పటి ఒక ప్రజాప్రతినిధి

‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో విచారణకు నాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ ఆదేశం

ఇంతవరకు వెల్లడికాని నివేదిక

కూటమివచ్చిన తరువాత విజిలెన్స్‌ విచారణకు ఆదేశం

ఏడాదిన్నర దాటినా పూర్తికాని దర్యాప్తు

అనుమతి లేని లేఅవుట్‌లో రోడ్లు, విద్యుత్‌ లైన్ల పనులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధి విస్సన్నపేటలో సాగిన భూ దోపిడీపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ నత్తనడకన సాగుతోందా?.. అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఏడాదిన్నర దాటినా విచారణ పూర్తికాకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. మరోవైపు అనుమతులు లేని లేఅవుట్‌లో రహదారుల నిర్మాణం, విద్యుత్‌ లైన్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 195-2లో 609.24 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిలో 300 ఎకరాల వరకు జిరాయితీ కాగా మరో 200 ఎకరాలు ఇనాం, బంజరు/డి-పట్టా భూములు ఉన్నాయి. జిరాయితీ భూముల్లో రాంబిల్లికి చెందిన కొన్ని భూస్వామ్య కుటుంబాలకు తాత ముత్తాతల నుంచి దఖలు పడినవి ఉన్నాయి. డి-పట్టా భూములు స్థానికుల పేర్లతో ఉన్నాయి. ఈ భూముల కొనుగోలు కోసం నాడు అధికారంలో వున్న వైసీపీకి చెందిన ఇద్దరు నేతలు, మరో ప్రజా ప్రతినిధి ద్వారా రైతులపై వివిధ రకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చారు. చివరకు బెదిరించి బలవంతంగా కొనుగోలు చేశారు. ఈ భూములను చదును చేసే క్రమంలో అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారు. దీనిపై తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు ఆందోళనలు చేశారు. విచారణ జరపాలని ఆయా శాఖల అధికారులకు ఫిర్యాదులు చేశారు. చివరకు ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు రావడంతో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. అనకాపల్లి ఆర్డీవో, సర్వే, గనుల శాఖ ఏడీలు, అనకాపల్లి తహసీల్దార్‌, ఇనామ్‌ తహసీల్దారుతో కూడిన కమిటీ పలు పర్యాయాలు విస్సన్నపేటలో చదునుచేసిన భూములను పరిశీలించి, అనేక అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించింది. భూములను చదునుచేసే క్రమంలో చెట్లు నరికివేశారు. సహజసిద్ధమైన వాగులు, గెడ్డలను పూడ్చేశారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించారు. ఆ భూములున్న ప్రాంతానికి వెళ్లేందుకు రహదారి కోసం ప్రభుత్వ భూమితోపాటు దళితుల అసైన్డ్‌ భూములూ ఆక్రమించుకున్నట్టు కమిటీ నిర్ధారించింది. అనంతరం అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేసింది. తరువాత జిల్లాల విభజన జరగడంతో ఫైళ్లన్నీ అనకాపల్లి తరలించారు. కానీ కమిటీ నివేదిక మాత్రం వెలుగు చూడలేదు. ఇదే అదనుగా అక్కడ లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్న వ్యక్తులు వీఎంఆర్‌డీఏ అనుమతి కోసం దరఖాస్తు చేశారు. అనుమతి రాకుండానే 403 ఎకరాల్లో 230 మౌంట్‌ విల్లాలు నిర్మించనున్నట్టు ‘వింటేజ్‌ మౌంట్‌ వ్యాలీ రిసార్ట్‌’ పేరుతో బ్రోచర్లు విడుదల చేశారు.

కొనసా..గుతున్న విజిలెన్స్‌ విచారణ

ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ 2024 సార్వత్రిక ఎన్నికల ముందు విస్సన్నపేట గ్రామాన్ని సందర్శించారు. వైసీపీ నేతలు, రైతుల నుంచి రైతుల డి.పట్టా భూములను బలవంతంగా తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. విస్సన్నపేట భూములపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కూటమి అధికారంలోకి రాగానే విస్సన్నపేట భూ కబ్జాలపై విచారణ జరిపించి భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. అన్నట్టుగానే కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో విస్సన్నపేట భూముల వ్యవహారంలో అక్రమాలను వెలికి తీసేందుకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఎటువంటి అనుమతులు లేకుండా భూములను చదును చేయడం, ‘ప్రతిపాదిత వీఎంఆర్‌డీఏ లేఅవుట్‌’ అంటూ ప్రచారం చేసుకోవడం, ‘వింటేజ్‌ మౌంట్‌ వ్యాలీ రిసార్ట్‌’ పేరుతో బ్రోచర్లు విడుదల చేయడంతో వీఎంఆర్‌డీఏ అధికారులు స్పందించి, లేఅవుట్‌ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. 2024 అక్టోబరులో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కశింకోట తహసీల్దారు కార్యాలయంలో విస్సన్నపేట వివాదాస్పద భూముల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పూర్వ రికార్డులు, ఆన్‌లైన్‌లో వివరాల గురించి ఆరా తీశారు. కశింకోట తహసీల్దారు కార్యాలయం, అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయాలను పలుమార్లు సందర్శించి విస్సన్నపేట భూముల వివరాలు సేకరించారు. ఇది జరిగి దాదాపు ఏడాది దాటినా.. భూ ఆక్రమణదారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. విచారణ ఏ స్థాయిలో వుందో కూడా అధికారులు వెల్లడించడం లేదు.

లేఅవుట్‌లో జోరుగా పనులు

విస్సన్నపేటలో అనుమతి లేకుండా వేస్తున్న లేఅవుట్‌లో రహదారులు, విద్యుత్‌ లైన్ల ఏర్పాటు పనులను రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. పలుచోట్ల సీసీ కమెరాలు అమర్చారు. లేఅవుట్‌ ప్రవేశ ద్వారం వద్ద కంటైనర్‌ సెక్యూరిటీ పోస్టును ఏర్పాటు చేశారు. కాగా విస్సన్నపేట భూదందా అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడానికి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణను వేగవంతం చేసి ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు సమాచారం.

Updated Date - Feb 13 , 2026 | 01:00 AM