కొనసాగుతున్న పొగమంచు
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:07 AM
వాతావరణంలో మార్పుల కారణంగా మన్యంలో పొగమంచు కొనసాగుతున్నది. గురువారం తెల్లవారుజామున నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు పొగమంచు కమ్మేసింది. వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వచ్చింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండగా, రాత్రి వేళల్లో చలి ప్రభావం చూపుతున్నది. గురువారం అరకులోయలో 15.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా చింతపల్లిలో 17.4, కొయ్యూరులో 19.9, అనంతగిరిలో 21.2 డిగ్రీలు నమోదయ్యాయి.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
మధ్యాహ్నం తరువాత వర్షం
పాడేరు, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలో మార్పుల కారణంగా మన్యంలో పొగమంచు కొనసాగుతున్నది. గురువారం తెల్లవారుజామున నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు పొగమంచు కమ్మేసింది. వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వచ్చింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండగా, రాత్రి వేళల్లో చలి ప్రభావం చూపుతున్నది. గురువారం అరకులోయలో 15.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా చింతపల్లిలో 17.4, కొయ్యూరులో 19.9, అనంతగిరిలో 21.2 డిగ్రీలు నమోదయ్యాయి.
పిడుగుపడి ఇద్దరికి తీవ్రగాయాలు
డుంబ్రిగుడ, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లైగండ పంచాయతీ సిందిపుట్టు గ్రామంలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగులు పడడంతో పశువులను మేపడానికి వెళ్లిన సిందిపుట్టుకు చెందిన కిల్లో ధనుర్జయ్, గోల్లోరి నబోన తీవ్రంగా గాయపడ్డారు. ఒక ఎద్దుమృతిచెందింది. కుటుంబ సభ్యులు వీరిని చికిత్స నిమిత్తం స్థానిక పీహెచ్‌సీకిఇ తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ముంచంగిపుట్టులో భారీ వర్షం
ముంచంగిపుట్టు, ఏప్రిల్, 2 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. అంతకు ముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం కురిసింది. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో నీటి నిల్వలు పెరిగాయని మాచ్‌ఖండ్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు
చింతపల్లి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలో రాగల ఐదు రోజుల వాతావరణ సమాచారాన్ని గురువారం శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఏడో తేదీ వరకు 0.4 మిల్లీమీటర్ల నుంచి 13 మిల్లీ మీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుందన్నారు.