Share News

కొనసాగుతున్న చలి తీవ్రత

ABN , Publish Date - Jan 16 , 2026 | 10:55 PM

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో చలి తీవ్ర స్థిరంగా ఉంది. దీంతో గిరిజనం వణుకుతున్నారు.

కొనసాగుతున్న చలి తీవ్రత
పాడేరు- విశాఖపట్నం మెయిన్‌రోడ్డులో శుక్రవారం ఉదయం పొగమంచు

అరకులోయలో 6.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

దట్టంగా కురిసిన పొగమంచు

పాడేరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో చలి తీవ్ర స్థిరంగా ఉంది. దీంతో గిరిజనం వణుకుతున్నారు. శుక్రవారం అరకులోయలో 6.4 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. పెదబయలులో 6.6, ముంచంగిపుట్టులో 6.7, జి.మాడుగులలో 7.3, హుకుంపేటలో 8.5, చింతపల్లిలో 9.5, అనంతగిరిలో 14.0, కొయ్యూరులో 14.2 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వణుకుతున్న గిరిజనం

మన్యంలో కొన్నాళ్లుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో మన్యం వాసులు వణుకుతున్నారు. ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల వరకు పొగ మంచు కురవడం, మధ్యాహ్నం మాత్రమే ఒక మోస్తరుగా ఎండ కాస్తుండడంతో పగలు రాత్రుళ్లు సైతం చలి ప్రభావం చూపుతున్నది. దీంతో జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు వేసుకుంటూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు.

జీకేవీధిలో

మండలంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. శుక్రవారం జీకేవీధిలో 6.8డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం పదకొండు గంటల వరకు మంచు విపరీతంగా కురుస్తున్నది. దీంతో చలి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు 24గంటలు ఉన్ని దుస్తులను ధరించుకోవాల్సి వస్తున్నది. ప్రతి వీధి, గృహాల్లోనూ చలి మంటలు కొనసాగుతున్నాయి.

సీలేరులో..

జీకేవీధి మండలం సీలేరులో శుక్రవారం ఉదయం దట్టంగా పొగమంచు కురిసింది. ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు కురవడంతో వాహనదారులు లైట్లు వేసుకొని రాకపోకలు సాగించారు. గురువారం రాత్రి నుంచి సీలేరు పరిసర ప్రాంతాల్లో చలి తీవ్రత అధికమైంది.

Updated Date - Jan 16 , 2026 | 10:55 PM