Share News

తేనెటీగల దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - May 07 , 2026 | 12:08 AM

మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలు కింద వైపు ఉన్న గోస్తనీ నది వద్ద బుధవారం తేనెటీగలు దాడి చేయడంతో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.

తేనెటీగల దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు
తేనెటీగల దాడిలో గాయపడిన పూజారికి సపర్యలు చేస్తున్న దృశ్యం

మరొకరికి స్వల్ప గాయాలు

అనంతగిరి, మే 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలు కింద వైపు ఉన్న గోస్తనీ నది వద్ద బుధవారం తేనెటీగలు దాడి చేయడంతో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. కోరాపుట్‌ జిల్లా నందపూర్‌కు చెందిన కొంతమంది గిరిజనులు ఆస్థికలు కలిపేందుకు బొర్రా గుహలు కింద వైపు ఉన్న గోస్తనీ నది వద్దకు బుధవారం చేరుకున్నారు. కొంతమంది స్నానాలు చేసేందుకు వెళ్లగా, నందపూర్‌కు చెందిన పూజారి కొల్యాసోమ్ని(76) హోమం చేసేందుకు ధూపం వేయడంతో సమీపంలో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో పూజారి కొల్యాసోమ్ని తీవ్రంగా గాయపడగా, మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న గైడ్స్‌, బ్రో సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని పూజారిని అనంతగిరి పీహెచ్‌సీకి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. కాగా గోస్తనీ వద్ద స్నానాలు చేసేందుకు వెళ్లిన గిరిజనులు తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్నారు.

Updated Date - May 07 , 2026 | 12:08 AM