లారీ ఢీకొని ఒకరి మృతి
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:49 AM
దేశపాత్రునిపాలెం నుంచి పిట్టవానిపాలెం మీదుగా యాష్ పాండ్‌కు వెళ్లే ప్రధాన రహదారిలోని ఎఫ్‌సీఐ గొడౌన్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
ఎఫ్‌సీఐ గొడౌన్ సమీపంలో ఘటన
పరవాడ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): దేశపాత్రునిపాలెం నుంచి పిట్టవానిపాలెం మీదుగా యాష్ పాండ్‌కు వెళ్లే ప్రధాన రహదారిలోని ఎఫ్‌సీఐ గొడౌన్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. దీనికి సంబంధించి పరవాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ 104వ వార్డు పరిధి పిట్టవానిపాలెం గ్రామానికి చెందిన పిట్టా శంకర్‌రెడ్డి(40) స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నారు. శనివారం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి ఆయన బయలుదేరారు. సరిగ్గా ఎఫ్‌సీఐ గొడౌన్ సమీపం వద్దకు వచ్చేసరికి అదే రహదారిలో ఫ్లైయాష్ కోసం యాష్‌పాండ్‌కు వెళుతున్న డంపర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పరవాడ ఇన్‌చార్జి డీఎస్పీ బి.మోహనరావు, సీఐ ఎల్.భాస్కరరావు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని సీఐ భాస్కరరావు తెలిపారు.