‘ఒక నెల.. ఒక నియోజకవర్గం’
ABN , Publish Date - May 29 , 2026 | 12:32 AM
ప్రజా సమస్యలను శీఘ్రగతిన పరిష్కరించడం, రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన కార్యక్రమం ‘ఒక నెల- ఒక నియోజకవర్గం- నాలుగు పర్యటనలు’ కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం శుక్రవారం శ్రీకారంచుడుతున్నది.
కార్యక్రమానికి నేడు శ్రీకారం
తొలి సదస్సు చోడవరంలో ఏర్పాటు
హాజరుకానున్న జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
కలెక్టర్ విజయకృష్ణన్ వెల్లడి
అనకాపల్లి కలెక్టరేట్, మే 28 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను శీఘ్రగతిన పరిష్కరించడం, రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన కార్యక్రమం ‘ఒక నెల- ఒక నియోజకవర్గం- నాలుగు పర్యటనలు’ కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం శుక్రవారం శ్రీకారంచుడుతున్నది. మొట్టమొదటి సమావేశాన్ని చోడవరంలో నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చోడవరం పట్టణం కొత్తూరు జంక్షన్‌లోని మాధవ ఫంక్షన్ హాల్‌లో స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజుతో కలిసి ప్రారంభించనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడడం, సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడం, ప్రజల ఫిర్యాదుల పరిష్కార సేవలను వారి ఇంటి వద్దకే చేర్చడం, పీజీఆర్‌ఎస్‌లో అందిన వినతులు/ ఫిర్యాదులను నెల వ్యవధిలోనే పరిష్కరించడం, ఒకే సమస్యపై ప్రజలు పదేపదే అర్జీలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం చూపడం, కోర్టు వివాదాలను తగ్గించడం, ప్రభుత్వ పరిపాలనపై పౌరుల్లో నమ్మకాన్ని, సంతృప్తిని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. చోడవరం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలను.. ముఖ్యంగా రెవెన్యూ, ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించుకోవాలన్నారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. వీఆర్వోలు తమ పరిధికి సంబంధించి పూర్తి సమాచారం, రికార్డులతో సహా సదస్సుకు రావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పీజీఆర్‌ఎస్‌లో ఇప్పటి వరకు అందిన మొత్తం అర్జీలు, వాటిలో పరిష్కరించినవి, పెండింగ్‌లో వున్న వాటితోపాటు ఒక వ్యక్తి నుంచి ఒకే సమస్యపై పదే పదే వచ్చిన అర్జీల వివరాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.