పోస్టల్ పథకాలకు వంద శాతం భద్రత
ABN , Publish Date - Jun 06 , 2026 | 10:36 PM
పోస్టల్ ఖాతాదారులకు ఉత్తమ సేవలందించేందుకు ప్రత్యేక పొదుపు పథకాలను అమలుచేస్తున్నట్టు ఆంధ్ర సర్కిల్ పోస్టుమాస్టర్ జనరల్ బీకే శ్రీదేవి అన్నారు.
ఆంధ్ర సర్కిల్ పోస్టుమాస్టర్ జనరల్ బీకే శ్రీదేవి
ధింసా కళాకారులతో నృత్యం చేసిన సీజీఎం
అరకులోయ, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): పోస్టల్ ఖాతాదారులకు ఉత్తమ సేవలందించేందుకు ప్రత్యేక పొదుపు పథకాలను అమలుచేస్తున్నట్టు ఆంధ్ర సర్కిల్ పోస్టుమాస్టర్ జనరల్ బీకే శ్రీదేవి అన్నారు. శనివారం అరకులోయలోని ప్రైవేటు రిసార్టులో పోస్టల్ సిబ్బందితో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. పొదుపుదారులకు రిస్క్ లేని స్థిరమైన, ఆకర్షణీయమైన రాబడి పొందే విధంగా అనేక చిన్న మొత్తాల పొదుపు పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ పథకాలకు వంద శాతం ప్రభుత్వ భద్రత ఉంటుందన్నారు. సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం, పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీమ్, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, రికరింగ్ డిపాజిట్, ఎఫ్‌డీ, మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికెట్, పీఎల్‌ఐ తదితర పథకాల గురించి సీజీఎం శ్రీదేవి వివరించారు. అర్హులైన వారందరిని సేవింగ్ స్కీంల్లో చేర్పించి పోస్టల్ సిబ్బంది లక్ష్యాలను అధిగమించాలన్నారు. ఏయే పథకాలు.. ఏ మేర ప్రయోజనకరమో విశాఖ రీజియన్ పోస్ట్‌మాస్టారు జనరల్ జయశంకర్ వివరించారు. ఈ సమీక్షలో అరకు సబ్‌డివిజన్‌లో పనిచేసే పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే శనివారం ఉదయం తొలుత అరకులోయలో ఆంధ్ర సర్కిల్ పోస్టుమాస్టర్ జనరల్ బీకే శ్రీదేవి, విశాఖపట్నం రీజియన్ పోస్ట్‌మాస్టరు జనరల్ వీఎస్.జయశంకర్‌తో కలిసి పర్యటించారు. సుంకరమెట్ట, అరకులోయ పోస్టాఫీసులను సందర్శించారు. సుంకరమెట్టలో థింసా కళాకారులతో పోస్టుమాస్టర్ జనరల్ శ్రీదేవి కాసేపు నృత్యం చేశారు. అరకులోయ సబ్‌పోస్టాఫీసును సందర్శించారు. అక్కడ అందిస్తున్న సేవలను ఐపీవో కిశోర్ వివరించారు. ఈ కార్యక్రమాల్లో అరకులోయ సబ్‌డివిజన్ పోస్టల్ అధికారులు, అనకాపల్లి ఎస్‌పీవో చుక్కా శ్రీనివాసరావు పాల్గొన్నారు.