Share News

రెండు వ్యాన్లు ఢీకొని ఒకరి మృతి

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:43 AM

అల్లూరి- పోలవరం జిల్లాల సరిహద్దు కాకరపాడు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం రెండు వ్యాన్లు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

రెండు వ్యాన్లు ఢీకొని ఒకరి మృతి
దొరబాబు (ఫైల్‌ ఫొటో)

- ఇద్దరికి తీవ్ర గాయాలు

కొయ్యూరు, జూలై 28 (ఆంధ్రజ్యోతి): అల్లూరి- పోలవరం జిల్లాల సరిహద్దు కాకరపాడు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం రెండు వ్యాన్లు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొంగశింగి గ్రామానికి చెందిన కోట దొరబాబు(31) మంగళవారం ఉదయం వ్యవసాయ సామగ్రి లోడుతో వ్యాన్‌లో పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి వెళ్లాడు. అక్కడ లోడు దించేసి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో మండలంలోని ఎం.మాకవరానికి చెందిన కాళ్ల విజయ్‌ యూరియా లోడుతో వ్యాన్‌లో కృష్ణాదేవిపేట నుంచి రాజవొమ్మంగి వెళుతున్నాడు. కాకరపాడు కు అతి సమీపంలో జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఈ రెండు వ్యాన్లు ఢీకొన్నాయి. దీంతో యూరియా లోడు వ్యాన్‌ బోల్తా పడగా, దొరబాబు వ్యాన్‌ రెండు ముక్కలుగా విడిపోయింది. ఈ ఘటనలో దొరబాబు వ్యాన్‌ శకలాల మధ్య ఇరుక్కుపోయి మృతి చెందాడు. ఆ వ్యాన్‌లో ఉన్న కొంగసింగి గ్రామానికి చెందిన వై.తేజకి తీవ్ర గాయాలయ్యాయి. మరో వ్యాన్‌ డ్రైవర్‌ విజయ్‌ తలకు బలమైన గాయం కావడంతో పాటు కుడి చెయ్యి విరిగిపోయింది. మరొక వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద విషయం తెలిసి కొయ్యూరు ఎస్‌ఐ కిశోర్‌వర్మ తన సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లి క్షతగాత్రులను తరలించేందుకు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలం తమ పరిధిలోనిది కాకపోవడంతో రాజవొమ్మంగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం క్షతగాత్రులను రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై రాజవొమ్మంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు దొరబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని మృతితో కొంగసింగి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Jul 29 , 2026 | 12:43 AM