ఆర్కే బీచ్‌రోడ్డులో పుట్టగొడుగుల్లా
ABN , Publish Date - Jul 16 , 2026 | 01:18 AM
నగరంలో ప్రధాన పర్యాటక కేంద్రమైన ఆర్కే బీచ్‌రోడ్డులో అనధికార దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇసుక తిన్నెలుతోపాటు ఫుట్‌పాత్‌లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటుచేస్తుండడంతో సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఆహార వ్యర్థాలు, చెత్తాచెదారం...ఎక్కడపడితే అక్కడ పడేస్తుండడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.
దుకాణాలు
అత్యధికం ఎటువంటి
అనుమతులు లేకుండా ఏర్పాటుచేసినవే...
చోటా నేతల అండదండలు
వ్యాపారసంఘాల పేరుతో మరికొన్ని ఆక్రమణలు
ఫుట్‌పాత్‌లపైనా ఏర్పాటు
సందర్శకులకు తప్పని ఇబ్బందులు
ఆహార వ్యర్థాలు అక్కడే పడేస్తుండడంతో
పారిశుధ్య సమస్య
ఆక్రమణల తొలగింపుపై కమిషననర్ దృష్టి
అడ్డుపడుతున్న కొందరు ప్రజా ప్రతినిధులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో ప్రధాన పర్యాటక కేంద్రమైన ఆర్కే బీచ్‌రోడ్డులో అనధికార దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇసుక తిన్నెలుతోపాటు ఫుట్‌పాత్‌లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటుచేస్తుండడంతో సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఆహార వ్యర్థాలు, చెత్తాచెదారం...ఎక్కడపడితే అక్కడ పడేస్తుండడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.
బీచ్‌రోడ్డులో కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఉదయంతో పోల్చితే సాయంత్రం, రాత్రివేళ మరింత రద్దీగా ఉంటుంది. అందుకే బీచ్‌రోడ్డులో అన్ని రకాల వ్యాపారాలు బాగానే జరుగుతుంటాయి. మురీమిక్చర్, పానీపూరీ, నూడిల్స్ వంటి ఫాస్ట్‌ఫుడ్ ఐటమ్స్‌తోపాటు టిఫిన్, బిర్యానీ, శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లకు మంచి గిరాకీ ఉంటుంది. దీంతో చాలామంది ఫుట్‌పాత్‌లపైనా, పార్కింగ్ ప్రాంతాల్లోనూ దుకాణాలను ఏర్పాటుచేసుకున్నారు. కొందరైతే దుకాణాలను ఏర్పాటుచేసి అద్దెకు ఇచ్చుకుని ఆదాయం సంపాదిస్తున్నారు. అదేవిధంగా కొందరు ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల అండదండలతో మరికొందరు దుకాణాలను విచ్చలవిడిగా ఏర్పాటుచేస్తున్నారు. జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే తీరంలోనూ, ఫుట్‌పాత్‌లపై దుకాణాలు పెడుతున్నారు. అటువంటి దుకాణాలను తొలగించేందుకు జీవీఎంసీ సిబ్బంది యత్నిస్తే ప్రజా ప్రతినిధులు అడ్డంపడుతున్నారు. దీంతో బీచ్‌రోడ్డులో అనధికార దుకాణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.
ఆహార వ్యర్థాలతో పారిశుధ్య లోపం
సందర్శకులు, పర్యాటకులు దుకాణాల వద్ద ఆహార పదార్థాలను కొనుగోలు చేసి వ్యర్థాలను ఇసుక తిన్నెలపై, ఫుట్‌పాత్‌లపై పడేసి వెళ్లిపోతున్నారు. దీనివల్ల తీరంలో పారిశుధ్యలోపం తలెత్తుతోంది. పారిశుధ్య కార్మికులు ఎంత శ్రమించినా, యంత్రాలతో తీరంలోని ఇసుకను రోజూ శుభ్రం చేస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. వ్యాపారులు తమ దుకాణాల వద్ద విధిగా డస్ట్ బిన్ పెట్టి వ్యర్థాలను అందులోనే వేయాలని వినియోగదారులకు చెప్పాలి. కానీ, వ్యాపారంలో పడి ఆ విషయాన్ని విస్మరిస్తున్నారు.
ఆర్కే బీచ్ రోడ్డులో పరిస్థితులను తెలుసుకునేందుకు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ఇటీవల స్వయంగా వెళ్లారు. తీరంలోని ఇసుక తిన్నెలతోపాటు ఫుట్‌పాత్‌లపై విచ్చలవిడిగా దుకాణాలను ఏర్పాటుచేయడం వల్ల పర్యాటకులు కూర్చునేందుకు సైతం ఇబ్బంది పడుతున్నారని గుర్తించారు. వాటన్నింటినీ తొలగించాలని టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అందుకోసం ముందుగా బీచ్‌రోడ్డులో దుకాణాలు ఎన్ని ఉన్నాయి?, అందులో అనుమతి లేకుండా ఏర్పాటుచేసినవి ఎన్ని?... అనే వివరాలు తెలుసుకునేందుకు అధికారులు సర్వే జరిపారు. తీరంలోని ఇసుక తిన్నెలతోపాటు బీచ్ వైపు ఫుట్‌పాత్‌పై ఉన్న అనధికార దుకాణాలను తొలగించేందుకు మంగళవారం వ్యాపారసంఘాలతో అధికారులు సమావేశం ఏర్పాటుచేశారు. దుకాణాలను తొలగించడం ఖాయమని భావించిన వర్తక సంఘాల నేతలు నగరంలోని ఇద్దరు ప్రజా ప్రతినిధులను కలిసి తమ జోలికి రాకుండా జీవీఎంసీ కమిషనర్‌ను ఆదేశించాలని కోరారు. వారిద్దరూ కమిషనర్‌కు ఫోన్ చేసి దుకాణాల జోలికి వెళ్లొద్దని ఒత్తిడి చేశారని, అందువల్లనే బుధవారం జరగాల్సిన దుకాణాల తొలగింపు స్పెషల్ డ్రైవ్ నిలిచిపోయిందని టౌన్‌ప్లానింగ్ విభాగం సిబ్బంది చెబుతుండడం విశేషం.