దీర్ఘకాలిక సెలవులో వీఎంఆర్‌డీఏ జాయింట్ కమిషనర్
ABN , Publish Date - May 28 , 2026 | 01:22 AM
దీర్ఘకాలిక సెలవులో వీఎంఆర్‌డీఏ జాయింట్ కమిషనర్
ఉన్నతాధికారుల అవమానాలు భరించలేకే...
విశాఖపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి):
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) జాయింట్ కమిషనర్ రమేశ్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. ఆయన గత 20 రోజులుగా సెలవులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వీఎంఆర్‌డీఏకు కొత్తగా అడిషనల్ కమిషనర్ పోస్టు సృష్టించి అందులో దాట్ల కీర్తిని నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉన్నతాధికారులు తరచూ అవమానించడాన్ని రమేశ్ తట్టుకోలేకపోయారని విశ్వసనీయ సమాచారం. నాలుగు నెలల ముందు కూడా ఉన్నతాధికారి అవమానించారని రమేశ్ పది రోజులు విధులకు వెళ్లలేదు. పెద్దలు కొందరు నచ్చజెప్పి రమేశ్‌ను ఒప్పించారు. కానీ ఉన్నతాధికారుల తీరులో మార్పు రాకపోవడం, వేరే అధికారిని తెచ్చుకుంటామని బహిరంగంగానే వ్యాఖ్యానించడంతో ఆయన సెలవుపై వెళ్లిపోయినట్టు తెలిసింది. ఉన్నతాధికారులు తాము చెప్పినట్టుగానే అడిషనల్ కమిషనర్ పోస్టులో ఆర్‌డీఓ స్థాయి అధికారిని తెచ్చుకున్నారు. ఇటీవల వీఎంఆర్‌డీఏలో అవినీతి ఎక్కువైందనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. కొందరు ఒక బృందంగా ఏర్పడి అన్నీ చక్కబెడుతున్నారని ప్రచారం జరుగుతోంది.