తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తం
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:23 PM
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ నిషాంతి ఆదేశం
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
అందుబాటులో 08935-293448, 9281856953 ఫోన్ నంబర్లు
పాడేరు రూరల్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. ఈ మేరకు ఆమె అధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, అలాగే మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. షిఫ్టుల వారీగా సిబ్బందిని నియమించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అత్యవసర సమాచారాన్ని వెంటనే సంబంధిత అధికారులకు చేరవేయాలన్నారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 08935-293448, 9281856953ను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాలు, హోర్డింగ్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, అగ్నిమాపక శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావం కారణంగా ఎన్నికల నిర్వహణకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ తుఫాన్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, అన్నిశాఖల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు.