Share News

తుఫాన్‌తో అప్రమత్తం

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:08 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌తో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇది తీవ్ర తుఫాన్‌గా మారి 20వ తేదీన తీరాన్ని తాకుతుందని, బుధవారం నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌, జేసీ శౌర్యమాన్‌ పటేల్‌ మంగళవారం కలెక్టరేట్‌ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

తుఫాన్‌తో అప్రమత్తం
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జేసీ శౌర్యమాన్‌ పటేల్‌

జిల్లా అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

అనకాపల్లి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌తో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇది తీవ్ర తుఫాన్‌గా మారి 20వ తేదీన తీరాన్ని తాకుతుందని, బుధవారం నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌, జేసీ శౌర్యమాన్‌ పటేల్‌ మంగళవారం కలెక్టరేట్‌ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌, పోలీసు, రోడ్లు భవనాలు, అగ్నిమాపక, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. మండలస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా సమాచారాన్ని పంచుకోవాలని, తుఫాన్‌ ముందస్తు సహాయ చర్యల్లో భాగస్వాములు కావాలన్నారు. పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో సముద్ర తీరంలోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో వీరిని సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు అవసరమైన భవనాలను సిద్ధం చేయాలని రెవెన్యూ, పోలీసు శాఖలను ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా మత్స్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయాలన్నారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారిని వెంటనే వెనక్కి రప్పించాలని స్పష్టం చేశారు. మత్స్యకార గ్రామాల్లో బోట్లు, వలలు, ఇంజన్లు, ఇతర సామగ్రిని సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి సహాయ పడాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు క్షేత్రస్థాయిలో అందుబాటులోనే వుండి, తుఫాన్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ వై.సత్యనారాయణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2026 | 01:08 AM