Share News

తుఫాన్‌తో అప్రమత్తం

ABN , Publish Date - Oct 25 , 2026 | 01:30 AM

బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం సోమవారం నాటికి తుఫాన్‌గా, ఆ తరువాత రెండు రోజుల్లో తీవ్ర తుఫాన్‌గా మారి కోస్తాంధ్రలో తీరం దాటనున్నది.

తుఫాన్‌తో అప్రమత్తం

నేడు జిల్లాలో అధికారులతో కలెక్టర్‌ వెబెక్స్‌

12 జిల్లాల్లో ఈపీడీసీఎల్‌ కంట్రోల్‌ రూమ్‌లు

విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):

బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం సోమవారం నాటికి తుఫాన్‌గా, ఆ తరువాత రెండు రోజుల్లో తీవ్ర తుఫాన్‌గా మారి కోస్తాంధ్రలో తీరం దాటనున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, అన్ని జిల్లాల కలెక్టర్లను విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కోస్తాంధ్రలో విశాఖపట్నం నుంచి బాపట్ల వరకు జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. దీంతో జిల్లా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చూడాలని మత్స్య శాఖను ఆదేశించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న వారంతా వెంటనే వెనక్కి రావాలని హెచ్చరిక జారీచేశారు. ఆదివారం కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ ప్రధాన శాఖల అదికారులతో వెబెక్స్‌ నిర్వహించనున్నారు. జీవీఎంసీ, ఈపీడీసీఎల్‌, విద్య, రెవెన్యూ, పంచాయతీ, మత్స్య, పోలీస్‌, వైద్య ఆరోగ్యశాఖ, సచివాలయాల విభాగం అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. వాతావరణ శాఖ ఇప్పటికే తూర్పు నావికాదళం, కోస్టుగార్డులను అప్రమత్తం చేసింది.

ఈపీడీసీఎల్‌ సీఎండీ టెలి కాన్ఫరెన్స్‌

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారడం, సోమవారం నాటికి తుఫాన్‌ (అర్నాబ్‌)గా బలపడే అవకాశం ఉండడం, దానివల్ల 26 నుంచి 28వ తేదీ వరకు భారీవర్షాలు కురవనుండడంతో ఏపీఈపీడీసీఎల్‌ అప్రమత్తమైంది. సీఎండీ పృథ్వీతేజ్‌ శనివారం డిస్కమ్‌ పరిధిలోని 12 జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. విద్యుత్‌ వ్యవస్థ పరిస్థితిని ఎప్పటికిప్పుడు పరిశీలిస్తూ వెంట వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈదురుగాలులు ప్రభావం వల్ల విద్యుత్‌ వైర్లు తెగి పడినా, ట్రాన్స్‌ఫార్మర్లు పాడైనా తక్షణమే మరమ్మతులు చేయడానికి అవసరమైన స్తంభాలు, తదితర సరంజామా ముందుగానే సమకూర్చుకోవాలని ఆదేశించారు. విద్యుత్‌ వైర్లపై పడిన చెట్లకొమ్మల సమీపానికి ప్రజలు ఎవరూ వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్నారు. వినియోగదారులు ఎటువంటి అంతరాయాలు ఉన్నా 1912 నంబర్‌కు లేదా సంబంధిత కంట్రోల్‌ రూమ్‌కు తెలియజేయాలని కోరారు. విశాఖలో జోన్‌-1కు 9490610019, జోన్‌-2కు 9849628880, జోన్‌-3కు 9491030722కు కాల్‌ చేయాలని సూచించారు.


పొంచి ఉన్న ప్రమాదం

జాతీయ రహదారి, ఇతర ప్రధాన

రహదారులపైకి వేలాడుతున్న కొమ్మలు

పట్టించుకోని జీవీఎంసీ ఉద్యానవన విభాగం

చిన్నపాటి గాలులు వీచినా విరిగిపడుతున్న వైనం

తుఫాన్‌ నేపథ్యంలోనైనా మేల్కొనాలని నగర వాసుల డిమాండ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం తుఫాన్‌గా మారనున్నందున సోమవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు తీవ్రమైన గాలులు వీయడంతో పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్‌ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వార్తలు వస్తుండడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో జాతీయ రహదారి, ఇతర ప్రధాన రహదారుల వెంబడి ఉన్న భారీవృక్షాల కొమ్మలు ప్రస్తుతం రోడ్డుపైకి వేలాడుతుండడంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడపతున్నారు.

నగరంలో పచ్చదనం కోసం జాతీయ రహదారితోపాటు ఇతర ప్రధాన రహదారుల వెంబడి పెద్దసంఖ్యలో మొక్కలు నాటారు. అవన్నీ ఇప్పుడు భారీవృక్షాలై కాలుష్య తీవ్రతను తగ్గించడానికి దోహదపడుతున్నాయి. అయితే ప్రధాన రహదారుల వెంబడి ఉన్న భారీవృక్షాల కొమ్మలను కనీసం ఏడాదికి ఒకసారైనా ట్రిమ్మింగ్‌ చేయాలి. ఆ బాధ్యతను జీవీఎంసీ పూర్తిగా విస్మరించింది. దీనివల్ల కొమ్మలు రోడ్లపైకి వేలాడుతూ వచ్చిపోయే వాహనాల పైకప్పులకు తగులుతున్నాయి. ఎప్పుడైనా చిన్నపాటిగాలులు వీస్తే విరిగి రోడ్లపై పడుతున్నాయి. ఆ సమయంలో వాహనాల రాకపోకలకు ఆటంకం కలగడంతోపాటు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కోసారి ప్రాణనష్టం కూడా సంభవిస్తోంది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే జీవీఎంసీ అధికారులు ఏటా ఏదో ఒక సీజన్‌లో చెట్ల మనుగడకు ఇబ్బంది తలెత్తకుండా శాస్త్రీయ పద్ధతిలో కొమ్మలను కత్తిరించాల్సి ఉంటుంది. అలాచేస్తే వర్షాలు కురిసినప్పుడు, గాలులు వీచినప్పుడు కొమ్మలు విరిగిపడే పరిస్థితి రాదు.

పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలో ఏటా అక్టోబరు, నవంబరు నెలల్లో రోడ్ల వెంబడి ఉండే చెట్లకు ట్రిమ్మింగ్‌, ప్రూనింగ్‌ వంటి ప్రక్రియలను పూర్తిచేస్తుంటారు. ఈ చర్య మంచి ఫలితాలను ఇస్తోంది. జీవీఎంసీ పరిధిలో కూడా చెట్లను పరిరక్షించడం, పచ్చదనం పెంచడం, నగర సుందరీకరణ వంటి బాధ్యతలను నిర్వర్తించేందుకు హార్టికల్చర్‌ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. కానీ ఆ విభాగం సిబ్బంది ఎక్కడ చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడిపోతాయో అక్కడకు వెళ్లి వాటిని తొలగించడానికి మాత్రమే పరిమితమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వీధి లైట్లకు అడ్డుగా చెట్టుకొమ్మలు ఉంటున్నాయని, జీవీఎంసీ ఎలక్ర్టికల్‌ విభాగం సిబ్బంది లేదా స్థానికులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటిని తొలగిస్తున్నారు. అంతేగానీ ఏటా రోడ్ల వెంబడి ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడంపై దృష్టిపెట్టడం లేదు. తాజాగా తుఫాన్‌ హెచ్చరిక నేపథ్యంలోనైనా జీవీఎంసీ హార్టికల్చర్‌ విభాగం అధికారులు ముందుజాగ్రత్తగా జాతీయ రహదారితోపాటు ప్రధాన రహదారుల వెంబడి వేలాడుతున్న చెట్ల కొమ్మలను తొలగించాలని నగరవాసులు కోరుతున్నారు.


కిరండూల్‌ పాసింజర్‌కు అదనపు స్లీపర్‌ కోచ్‌

విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ-కిరండూల్‌ పాసింజర్‌ సర్వీసులకు తాత్కాలిక అదనపు స్లీపర్‌ కోచ్‌ను జత చేస్తున్నామని రైల్వే అధికారులు ప్రకటించారు. విశాఖ-కిరండూల్‌ పాసింజర్‌కు (58501) ఈ నెల 26 నుంచి 28 వరకు, తిరుగు ప్రయాణంలో కిరండూల్‌-విశాఖ పాసింజర్‌కు (58502) ఈ నెల 29 నుంచి నవంబరు 8 వరకు అదనపు స్లీపర్‌ కోచ్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

Updated Date - Oct 25 , 2026 | 01:30 AM