Share News

మత్స్యగెడ్డలో వృద్ధుడి గల్లంతు

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:15 PM

మండలంలోని సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామ సమీపంలోని మత్య్సగెడ్డలో స్నానానికి దిగిన ఒక వృద్ధుడు గల్లంతయ్యాడు. ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది.

మత్స్యగెడ్డలో వృద్ధుడి గల్లంతు
మత్య్పగెడ్డలో గాలింపు చర్యలు చేపడుతున్న దృశ్యం

ఆచూకీ కోసం గాలింపు

ముంచంగిపుట్టు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామ సమీపంలోని మత్య్సగెడ్డలో స్నానానికి దిగిన ఒక వృద్ధుడు గల్లంతయ్యాడు. ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఆ వృద్ధుడి కోసం మత్స్యగెడ్డలో ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. కుమర్మిపుట్టు గ్రామానికి చెందిన వంతాల గోపీనాథ్‌(72) సోమవారం ఉదయం ముంచంగిపుట్టు మండల కేంద్రానికి ఆరటిపండ్లు అమ్మేందుకు వెళ్లి సాయంత్రమైనా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతని కోసం బంధువులను వాకబు చేసినా ఫలితం లేకుండాపోయింది. అయితే మంగళవారం ఉదయం మత్య్సగెడ్డ వద్ద ఆ వృద్ధుడి దుస్తులు ఉండడంతో స్నానానికి దిగి గల్లంతై ఉంటాడని స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. స్థానికులు నాటుపడవపై గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న జడ్పీ చైౖర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబీకులను ఓదార్చారు. గాలింపు చర్యల్లో మండలస్థాయి అధికారులు ఉండకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ వి.రమేశ్‌, ఎంపీటీసీ సభ్యురాలు ఎం.సుబ్బలక్ష్మి, తదితరులు గాలింపు చర్యలను పర్యవేక్షించారు.

Updated Date - Mar 10 , 2026 | 11:15 PM