వైసీపీలో ముసలం
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:36 AM
పరిషత్ ఎన్నికల పుణ్యమంటూ అల్లూరి జిల్లా వైసీపీలో ముసలం ఏర్పడింది.
తమకు ఎమ్మెల్యే అన్యాయం చేశారని ఎంపీటీసీ, మరొక ఎంపీటీసీ భర్త ఆరోపణ
ఎంపీపీ పదవి కోసం రూ.15 లక్షలు తీసుకున్నారని జీకే వీధి ఎంపీటీసీ సభ్యుడు బొబ్బిలి లక్ష్మణ్ ఆరోపణ
ఎంపీపీ బీఫారం ఇచ్చి మోసం చేశారని మోదకొండమ్మ ఆలయ ప్రధాన కార్యదర్శి పదవికి
పాడేరు ఎంపీటీసీ భర్త రాజీనామా
జడ్పీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో రచ్చకెక్కిన విభేదాలు
విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):
పరిషత్ ఎన్నికల పుణ్యమంటూ అల్లూరి జిల్లా వైసీపీలో ముసలం ఏర్పడింది. ప్రధానంగా పాడేరు ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు తమకు అన్యాయం చేశారని జీకేవీధికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు బొబ్బిలి లక్ష్మణ్, పాడేరు ఎంపీటీసీ అనంతకుమారి భర్త మోదకొండమ్మ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కోటిబాబునాయుడు బహిరంగంగానే ఆరోపిస్తుండడం విశేషం. తాజా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో జీకేవీధి ఎంపీపీగా బొబ్బిలి లక్ష్మణ్ పేరును ప్రతిపాదిస్తూ, బీఫారం ఇచ్చిన ఎమ్మెల్యే ఆఖరు నిమిషంలో తన వర్గానికి చెందిన లీలాప్రసాద్ అనే వ్యక్తిని ఎంపీపీ చేశారని బాధిత ఎంపీటీసీ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎంపీపీ పీఠం కోసం తన వద్ద ఎమ్మెల్యే రూ.15 లక్షలు తీసుకున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చే వరకు పోరాడతానని ఆయన పేర్కొన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని వైసీపీ అధిష్ఠానం దృష్టికి సైతం తీసుకువెళతానని శుక్రవారం పాడేరులోని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు క్యాంప్ కార్యాలయం వద్దే లక్ష్మణ్ పేర్కొనడం విశేషం.
మోదకొండమ్మ ఆలయ కమిటీ కార్యదర్శి రాజీనామా
స్థానిక మోదకొండమ్మ ఆలయ కమిటీ కార్యదర్శి పదవికి కోటిబాబునాయుడు రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం విలేకరులకు తెలిపారు. పాడేరులో ఎంపీటీసీ సభ్యులుగా గెలుపొందిన తన భార్య అనంతకుమారిని ఎంపీపీ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చి అన్యాయం చేశారని, ఈక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ హోదాలో ఎమ్మెల్యే నియమించిన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఇక నుంచి ఆలయ కమిటీకి చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు, కార్యదర్శి వ్యవహారాలను సైతం చూసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో జడ్పీ చైర్పర్సన్ పదవిని వైసీపీకి చెందిన పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆశించారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా పెదబయలు జడ్పీటీసీ సభ్యురాలు వంతాల శాంతిని చైర్పర్సన్ అఽభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. దీంతో ఆ పదవిని ఆశించిన పలువురు జడ్పీటీసీ సభ్యులు అవకాశం దక్కితే జంప్ అవ్వాలని భావించినప్పటికీ, కూటమికి ఆశించిన స్థానాలు దక్కకపోవడంతో అంతర్గతంగా ఆవేదన చెందుతూ మిన్నకున్నారని ప్రచారం జరుగుతున్నది. అధిష్ఠానం ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వంతాల శాంతిని చైర్‌పర్సన్‌గా ఎన్నుకోవడానికి వారు ముందుకు వచ్చారని వైసీపీలోనే పలువురు గుసగుసలాడుకుంటున్నారు.