బాబోయ్ హైవే
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:38 AM
జాతీయ రహదారి (ఎన్‌హెచ్-16)పై ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
జాతీయ రహదారిపై రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాలు
అతివేగం, నిర్లక్ష్యం, రాత్రివేళ డ్రైవర్ల నిద్రమత్తు/అలసట ప్రధాన కారణం
రోడ్డుపైనే భారీ వాహనాలను నిలుపుదల చేయడం కూడా...
తగరపువలస నుంచి పాయకరావుపేట వరకు 80కిపైగా బ్లాక్‌స్పాట్‌లు
ప్రమాదాల నివారణపై సీరియస్‌గా దృష్టిపెట్టని అధికారులు
నిషేధిత వేళల్లో నగరం మీదుగా యథేచ్ఛగా భారీ వాహనాల రాకపోకలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జాతీయ రహదారి (ఎన్‌హెచ్-16)పై ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వాహన చోదకుల నిర్లక్ష్యం, అతివేగం, సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే భారీ వాహనాల నిలుపుదలకు, డ్రైవర్ల విశ్రాంతికి తగిన వసతులు లేకపోవడం ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రమాదాల నియంత్రణకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తగరపువలస నుంచి పాయకరావుపేట వరకు సుమారు 140 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించి ఉంది. చెన్నై నుంచి కోల్‌కత్తాను కలిపే మార్గం కావడంతో నిత్యం వందలాది లారీలు, ట్రక్కులు వంటి భారీ వాహనాలతోపాటు కార్లు, ద్విచక్ర వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. అయితే అతివేగం, వాహన చోదకుల నిర్లక్ష్యం వల్ల జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాది విశాఖ నగర పరిధిలో 1,086 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 349 మంది మృతిచెందారు. అందులో జాతీయ రహదారిపై 640 ప్రమాదాలు జరగడంతో 215 మంది మృతిచెందారు. అనకాపల్లి జిల్లా పరిఽధిలో జాతీయ రహదారిపై 249 ప్రమాదాలు జరగ్గా 130 మంది మృతిచెందగా, 285 మంది గాయపడ్డారు. ఉదయం ఏడు నుంచి రాత్రి పది గంటల వరకు నగరంలోకి భారీ వాహనాలు ప్రవేశించకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ పోలీసుల ఉదాసీనత కారణంగా అమలు కావడం లేదు. ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన జాతీయ రహదారిపై రెండు చెక్‌పోస్టులు ఉండడంతో వాటిని తప్పించుకోవడానికి భారీ వాహనాలన్నీ నగరం మధ్య నుంచి వెళుతున్న జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తుండడం ప్రమాదాలు పెరుగుదలకు కారణంగా పోలీసులు చెబుతున్నారు.
ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు:
జాతీయ రహదారి పొడవునా దాదాపు 80 ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించిన పోలీసులు వాటిని బ్లాక్‌స్పాట్‌లుగా ప్రకటించారు. అయితే వీటిలో 15 ప్రాంతాల్లో మాత్రం మరింత ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. అవి..తగరపువలస, ఆనందపురం జంక్షన్, మధురవాడ, కార్‌షెడ్ జంక్షన్, ఎండాడ, హనుమంతవాక, మద్దిలపాలెం, ఎన్‌ఏడీ జంక్షన్, గాజువాక, కూర్మన్నపాలెం, అనకాపల్లి బైపాస్, కశింకోట, ఎలమంచిలి, నక్కపల్లి, పాయకరావుపేట
ప్రమాదాలకు పోలీసులు గుర్తించిన ప్రధాన కారణాలు:
- అతివేగం (అత్యధిక ప్రమాదాలకు ఇదే కారణం)
- నిర్లక్ష్యంగా ఓవర్ టేకింగ్ చేయడం
- రాంగ్‌సైడ్ డ్రైవింగ్
- డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించడం
- మద్యం సేవించి వాహనాలను నడపడం
- హెల్మెట్ లేకుండా నడపడం
- రాత్రివేళ డ్రైవర్ల నిద్రమత్తు, అలసట
- భారీ వాహనాలు నగరంలోకి రాకపోకలు సాగించడం
- అక్రమ యూటర్న్‌లు, సర్వీస్‌రోడ్డు నుంచి ఆకస్మికంగా జాతీయ రహదారిపైకి రావడం
- రహదారి నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలు
ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు
- బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి అక్కడ లోపాలను సరిచేయాలి
- అక్రమ యూటర్న్‌లను మూసివేయాలి
- సర్వీస్ రోడ్లను అభివృద్ధి చేయాలి
- పాదచారుల కోసం ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలి
- వేగ నియంత్రణకు లేజర్ గన్స్, ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటుచేయాలి
- హైవే పెట్రోలింగ్‌ను బలోపేతం చేయాలి
- బ్లాక్‌స్పాట్‌ల వద్ద రేడియం పెయింట్‌తో తయారుచేసిన హెచ్చరిక బోర్డులు పెట్టాలి
- డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మడం చేయడం
- డ్రైవర్లకు రాత్రివేళ నిద్రరాకుండా అప్రమత్తం చేయాలి
- దూరం నుంచి వచ్చే భారీ వాహనాలను రాత్రివేళ నిలుపుదల చేసేందుకు పార్కింగ్ బేలను అభివృద్ధి చేయాలి
- డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి తేవాలి
- భారీవాహనాలు నిషేధిత సమయాల్లో నగరంలోకి రాకుండా అడ్డుకట్టవేయాలి
మృతుల్లో పాదచారులు, ద్విచక్ర వాహనచోదకులే అధికం
జాతీయ రహదారిపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందేవారిలో పాదచారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. పాదచారులు జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటాల్సి ఉన్నప్పటికీ, వాహనాల రాకపోకలను గమనించకుండా ఎక్కడపడితే అక్కడ దాటేందుకు యత్నిస్తూ ప్రమాదాల బారినపడుతున్నారు.
ఇక రోడ్డు ప్రమాద మృతుల్లో అత్యధికులు ద్విచక్ర వాహనచోదకులే ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం, జాతీయ రహదారిపై కుడి వైపు నుంచి ప్రయాణించడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ నడపడం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు ద్విచక్ర వాహన చోదకులు జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకోవడానికి కొద్దిదూరం వెళ్లాల్సి ఉంటుందని, డివైడర్ పైనుంచి అవతలి వైపు రోడ్డులోకి వచ్చేస్తున్నారు. అదే సమయంలో అటువైపు నుంచి వేగంగా వచ్చే వాహనాలు వారిని ఢీకొడుతున్నాయి.
-
ప్రమాదాలకు నిలయం తాళ్లవలస సర్వీసురోడ్డు
భీమునిపట్నం, (రూరల్) జూలై 4 (ఆంధ్రజ్యోతి)
జాతీయ రహదారిపై భీమిలి మండలం తాళ్లవలస సర్వీస్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా తయారైంది. గత ఆరు నెలల కాలంలో ఈ ప్రాంతంలో ఎనిమిది ప్రమాదాలు జరిగాయి. ముగ్గురు చనిపోయారు. ఆరుగురు గాయపడ్డారు. ఈ రహదారిలో మూడుగుళ్ల అమ్మవారి గుడివద్ద కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. జాతీయ రహదారిని దాటుకుని సర్వీస్ రోడ్డులోకి వచ్చే క్రమంలో ఎంతోమంది వాహనాలు ఢీకొని మృత్యువాత పడ్డారు. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. నలుగురు గాయపడ్డారు.
ఆనందపురం మండల పరిధిలో 63 ప్రమాదాలు
ఆనందపురం మండల పరిధిలో గల జాతీయ రహదారిపై జనవరి నుంచి జూన్ వరకు సుమారు 63 ప్రమాదాలు జరిగాయి. 12 మంది మృతిచెందగా, 54 మంది గాయపడ్డారు. ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగినట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ముఖ్యంగా మండలంలోని భీమిలి క్రాస్‌రోడ్డు, పెద్దిపాలెం, ఆనందపురం జంక్షన్, గండిగుండం, మామిడిలోవ, గుడిలోవ, శొంఠ్యాం, గిడిజాల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరిగినట్టు పోలీసులు తెలిపారు.
పీఎం పాలెం ప్రాంతంలో 13 మంది మృతి
జాతీయ రహదారిపై పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎండాడ నుంచి బోయపాలెం జంక్షన్ వరకు 2026 జనవరి నుంచి జూన్ 30 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృతిచెందగా, 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎండాడ దిశ పోలీస్ స్టేషన్ సమీపాన గల మలుపు వద్ద రోడ్డు పల్లంగా ఉండడంతో అక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే మధురవాడ, చంద్రంపాలెం ప్రాంతాల్లో జాతీయ రహదారి దాటుతూ అనేక మంది ప్రమాదాల బారినపడ్డారు.
సిటీలో అయితే రోడ్డు దాటుతున్నప్పుడే...
నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి శాంతిపురం సిగ్నల్ పాయింట్ నుంచి తాటిచెట్లపాలెం సిగ్నల్ పాయింట్ వరకు జాతీయ రహదారిపై పది రోడ్డు ప్రమాదాలు (ఎఫ్‌ఐఆర్ అయినవి) జరిగాయి. ముగ్గురు మృతిచెందారు. పోర్టు ఆస్పత్రి, తాటిచెట్లపాలెం 38 బస్టాప్ వద్ద, అక్కయ్యపాలెం, శాంతిపురం ప్రాంతాల్లో పాదచారులు రోడ్డు దాటుతుండగా జరుగుతున్న ప్రమాదాలే ఎక్కువ. అలాగే ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది ప్రమాదాలు జరగ్గా ముగ్గురు మృతిచెందారు.
గాజువాక ప్రాంతంలో 29 ప్రమాదాలు
ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ 30 వరకూ గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో గల లంకెలపాలెం-షీలానగర్ మధ్య జాతీయ రహదారిపై 29 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 35 మంది మృతిచెందారు. మరో 36 మంది గాయపడ్డారు. స్టీల్‌ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 మంది, గాజువాక స్టేషన్ పరిధిలో 20 మంది మృతిచెందారు. ఫిబ్రవరి నెలలో పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ఓ వృద్ధుడు, మరో యువకుడు మృతిచెందారు. మార్చిలో పంతులుగారి మేడ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.
దువ్వాడ స్టేషన్ పరిధిలో 15 మంది మృతి
దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ 30 వరకూ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో 15 మంది మృతిచెందగా, 19 మంది గాయపడ్డారు. శ్రీనగర్ నుంచి వడ్లపూడి వెళ్లే మార్గంలో గల బ్రిడ్జి, కూర్మన్నపాలెం శ్రీకుంచుమాంబ ఆలయం వద్ద, ఉప్పర కాలనీ వద్ద గల బ్రిడ్జిల వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల కారణంగా రక్షణ గోడలు ధ్వంసమై ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆర్‌అండ్ బి శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. బ్రిడ్జిల వద్ద రక్షణ గోడలు లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, లారీలకు క్లీనర్లు లేకపోవడం, నిద్ర లేకుండా/మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, మలుపులు వద్ద అప్రమత్తత లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. జూన్ నెలలో శ్రీనగర్ జంక్షన్ వద్ద లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. అలాగే లంకెలపాలెం-అగనంపూడి మధ్య గడిచిన ఆరు నెలల కాలంలో ఐదు ప్రమాదాలు జరిగాయి. ఐదుగురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. లంకెలపాలెం కూడలితో పాటు ఇ-మర్రిపాలెం, అగనంపూడి, ఆంజనేయస్వామి ఆలయ కూడళ్లలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.