బాబోయ్ హైవే
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:17 AM
జిల్లాలో జాతీయ రహదారిపై వివిధ ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అనకాపల్లి జలగలమదుం జంక్షన్ నుంచి పాయకరావుపేట వద్ద తాండవ వంతెన వరకు పలు జంక్షన్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. పోలీసు శాఖ గణాంకాల ప్రకారం అనకాపల్లి, కశింకోట, ఎలమంచిలి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల పరిధిలో ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఆరు నెలల కాలంలో జాతీయ రహదారిపై మొత్తం 129 ప్రమాదాలు జరిగాయి.
జాతీయ రహదారిపై రోజు రోజుకు పెరుగుతున్న ప్రమాదాలు
అతివేగం, నిర్లక్ష్యం, రాత్రివేళ డ్రైవర్ల నిద్రమత్తు/అలసట ప్రధాన కారణాలు
రోడ్డుపైనే భారీ వాహనాలను నిలుపుదల చేయడం కూడా...
పరిష్కార చర్యలపై సీరియస్‌గా దృష్టిపెట్టని అధికారులు
వాహనాల రద్దీ పెరిగినా.. విస్తరణకు నోచుకోని హైవే
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 129 ప్రమాదాలు
86 మంది మృతి, 135 మంది క్షతగాత్రులు
(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్)
జిల్లాలో జాతీయ రహదారిపై వివిధ ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అనకాపల్లి జలగలమదుం జంక్షన్ నుంచి పాయకరావుపేట వద్ద తాండవ వంతెన వరకు పలు జంక్షన్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. పోలీసు శాఖ గణాంకాల ప్రకారం అనకాపల్లి, కశింకోట, ఎలమంచిలి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల పరిధిలో ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఆరు నెలల కాలంలో జాతీయ రహదారిపై మొత్తం 129 ప్రమాదాలు జరిగాయి. ఆయా సంఘటనల్లో 86 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 135 మంది గాయాపడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని పోలీసు, రవాణా శాఖల అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మెరుగుపడడం లేదు. పైగా ఏటేటా ప్రమాదాలు, మరణాలు అధికం అవుతూనే వున్నాయి. పోలీసు శాఖ అప్పుడప్పుడు చేపడుతున్న స్పెషల్ డ్రైవ్‌లు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. పోలీసు, రవాణా, ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల మధ్య సమన్వయం లోపం, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, జాతీయ రహదారిపై అనధికార డివైడర్లు, ప్రమాదకర జంక్షన్ల వద్ద నివారణ చర్యలు చేపట్టకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, దాబాల వద్ద రోడ్డుపైనే వాహనాలను నిలుపుదల చేయడం.... ఇలా పలుకారణాల వద్ద రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయి, పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.
విస్తరణకు నోచుకోని జాతీయ రహదారి
కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిని సుమారు రెండు దశాబ్దాల క్రితం నాలుగు లేన్లుగా విస్తరించారు. కానీ తరువాత కాలంలో వాహనాల రద్దీ గణనీయంగా పెరిగింది. జాతీయ రహదారిని రాష్ట్ర పరిధిలో అనకాపల్లి- రాజమహేంద్రవరం (దివాన్‌చెరువు) మినహా మిగిలిన ప్రాంతమంతా ఆరు లేన్లుగా విస్తరించారు. అనకాపల్లి- రాజమహేంద్రవరం మధ్య విస్తరణకు నోచుకోకపోవడంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రమాదాలు సైతం అధికం అయ్యాయి. ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల అంచనా ప్రకారం అన్ని రకాల వాహనాలు కలిపి రోజుకు సగటున 60 వేలకుపైగా రాకపోకలు సాగిస్తున్నాయి.
-----
తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలు
అనకాపల్లి బైపాస్, పిసినికాడ, కశింకోట, తాళ్లపాలెం, షేకిళ్లపాలెం, కొక్కిరాపల్లి, పెదపల్లి, రేగుపాలెం, పోతిరెడ్డిపాలెం, పురుషోత్తపురం, పులపర్తి, లక్కవరం, గోకులపాడు, పెనుగొల్లు, కోనవానిపాలెం, ధర్మవరం అగ్రహారం, నక్కపల్లి, వెదుళ్లపాలెం, వేంపాడు, ఉద్దండపురం, గొడిచెర్ల జంక్షన్, నామవరం, పీఎల్.పురం, పేట వై.జంక్షన్.
------
ప్రమాదాలకు పోలీసులు గుర్తించిన ప్రధాన కారణాలు:
- అతివేగం (అత్యధిక ప్రమాదాలకు ఇదే కారణం)
- నిర్లక్ష్యంగా ఓవర్ టేకింగ్ చేయడం
- రాంగ్ రూట్‌లో డ్రైవింగ్
ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం
డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించడం
- మద్యం సేవించి వాహనాలను నడపడం
- హెల్మెట్ లేకుండా నడపడం
- రాత్రివేళ డ్రైవర్ల నిద్రమత్తు, అలసట
హోటళ్లు, దాబాల వద్ద రోడ్డుపైనే భారీ వాహనాలను పార్కింగ్ చేయడం
రహదారి నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలు
----
ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు
- బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి అక్కడ లోపాలను సరిచేయాలి
- అక్రమ యూటర్న్‌లను మూసివేయాలి
- జంక్షన్లలో పాదచారుల కోసం ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలి
- వేగ నియంత్రణకు లేజర్ గన్స్, ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటుచేయాలి
- హైవే పెట్రోలింగ్‌ను బలోపేతం చేయాలి
- బ్లాక్‌స్పాట్‌ల వద్ద రేడియం పెయింట్‌తో హెచ్చరిక బోర్డులు పెట్టాలి
- డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలి
- సరుకు రవాణా వాహనాలను రాత్రివేళ నిలుపుదల చేసేందుకు పార్కింగ్ బేలను అభివృద్ధి చేయాలి
- డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తేవాలి
-----
‘కశింకోట’లో 31 ప్రమాదాలు.. 20 మంది మృతి
కశింకోట, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై కశింకోట మండల పరిధిలో జనవరి నుంచి జూన్ వరకు 31 ప్రమాదాలు జరిగాయి. ఈ సంఘటనల్లో 20 మంది మృతిచెందగా, 42 మందికి గాయాలయ్యాయి. ఆరు ప్రమాదాలతో బయ్యవరం కూడలి మొదటి స్థానంలో వుంది. దీంతోపాటు కశింకోటలో అధికంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పోలీసులు ఆయా ప్రదేశాలను బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మండల పరిధిలో అత్యధిక ప్రమాదాలు అర్ధరాత్రి తరువాత జరుగుతున్నాయి. డ్రైవర్లు నిద్రమత్తులోకి జారుకోవడం, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడమే కారణమని పోలీసులు చెబుతున్నారు.
---
‘నక్కపల్లి’లో 37 ప్రమాదాలు, 20 మంది మృతి
నక్కపల్లి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై మండలంలోని నక్కపల్లి ఆస్పత్రి, తహశీల్దార్ కార్యాలయం, ఉపమాక జంక్షన్, వెదుళ్లపాలెం, వేంపాడు, ఉద్దండపురం, గొడిచెర్ల జంక్షన్లలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు హైవేపై మండల పరిధిలో 37 ప్రమాదాలు సంభవించాయి. ఆయా సంఘటనల్లో 20 మంది మృతిచెందగా 31 మంది గాయపడ్డారు.
---
‘ఎలమంచిలి’లో 15 ప్రమాదాలు.. 18 మంది మృతి
ఎలమంచిలి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి మండలంలో ఇటు షేకిళ్లపాలెం నుంచి అటు పులపర్తి వరకు 12 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. షేకిళ్లపాలెం, కొక్కిరాపల్లి జంక్షన్, పెదపల్లి, రేగుపాలెం, పోతిరెడ్డిపాలెం, పురుషోత్తపురం, పులపర్తి, లక్కవరం జంక్షన్‌లు ప్రమాదకరమైనవిగా పోలీసులు గుర్తించారు. వీటిల్లో కొక్కిరాపల్లి జంక్షన్, పులపర్తి, పోతిరెడ్డిపాలెం పరిధిలో తరచూ ప్రమాదాలు జరుగుతన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు మండల పరిధిలో జాతీయ రహదారిపై 15 ప్రమాదాలు జరగ్గా.. 18 మంది మృత్యువాత పడ్డారు. 12 మందికి గాయాలయ్యాయి. వాహనాల రద్దీ గణనీయంగా పెరగడం, జాతీయ రహదారిని విస్తరించకపోవడం, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
----
ప్రమాదాలకు కేరాఫ్ తోటాడ జంక్షన్
అనకాపల్లి టౌన్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై జలగలమదుం జంక్షన్ నుంచి కొత్తూరు జంక్షన్ వరకు జనవరి నుంచి జూన్ వరకు పదికిపైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆయా సంఘటనల్లో ఎనిమిది మంది మృతిచెందగా, పది మంది గాయపడ్డారు. తోటాడ వెళ్లే జంక్షన్ (నూకాంబిక ఆలయ ముఖద్వారం), శారదా నది వంతెనపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. విశాఖ వైపు నుంచి నూకాంబిక ఆలయానికి వచ్చే భక్తులు హైవేపై తోటాడ జంక్షన్ వద్ద కుడివైపునకు తిరగాలి. అదే విధంగా అమ్మవారి దర్శనం అనంతరం కశింకోటవైపు వెళ్లే భక్తులు ఇదే జంక్షన్ వద్ద కుడివైపునకు తిరగాలి. ఇంకా పరవాడ, మునగపాక మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు, ఫార్మాసిటీలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు ఈ జంక్షన్ మీదుగానే అనకాపల్లి పట్టణంలోకి రాకపోకలు సాగిస్తుంటారు. హైవేపై వాహనాల రద్దీ పెరగడంతో తోటాడ జంక్షన్ ప్రమాదాలకు నిలయంగా మారింది.
------
అనకాపల్లి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో..
కొత్తూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై అనకాపల్లి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో గత ఆరు నెలల కాలంలో మొత్తం 15 ప్రమాదాలు జరిగాయి. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు గాయపడ్డారు. అనకాపల్లి మండలంలో పిసినికాడ జంక్షన్, కేఎన్‌ఆర్ పేట, మారేడుపూడి జంక్షన్, రేబాక వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు, ఆర్టీవో అధికారులు బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
----
9 ప్రమాదాలు.. ఏడుగురి మృతి
పాయకరావుపేట, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై మండలం పరిధిలోని వివిధ ప్రదేశాల వద్ద ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు తొమ్మిది ప్రమాదాలు జరగ్గా.. ఏడుగురు మృతిచెందారు. మరో 19 మంది గాయపడ్డారు. పాయకరావుపేట పట్టణంలోని తాండవ వంతెన నుంచి నామవరం వరకు సుమారు నాలుగు కిలోమీటర్లు మాత్రమే జాతీయ రహదారి వుంది. అయినప్పటికీ తాండవ జంక్షన్, వై.జంక్షన్, పీఎల్.పురం జంక్షన్, సీతారాంపురం జంక్షన్, నామవరంలో గాంధీనగరం, నామవరం జంక్షన్ వద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రధానంగా నామవరంలో నాలుగు రోడ్ల జంక్షన్ ప్రమాదాలకు నిలయంగా తయారైంది.
------
12 ప్రమాదాలు.. ఐదుగురి మృతి
ఎస్.రాయవరం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో ధర్మవరం అగ్రహారం నుంచి కోనవానిపాలెం జంక్షన్ వరకు జాతీయ రహదారి వుంది. గోకులపాడు, పెనుగొల్లు, అడ్డరోడ్డు జంక్షన్, కోనవానిపాలెం, ధర్మవరం అగ్రహారం జంక్షన్ వద్ద ప్రమాదాలు అధికంగా జరుగుతుంటాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు మొత్తం 12 ప్రమాదాలు జరగ్గా.. ఐదుగురు మృతిచెందారు. 14 మంది గాయపడ్డారు.
----
లంకెలపాలెం- అగనంపూడి మధ్య ఐదుగురు..
అగనంపూడి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై లంకెలపాలెం- అగనంపూడి మధ్య తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సాధారణ ట్రాఫిక్‌తోపాటు ఫార్మాసిటీ, పరవాడ పారిశ్రామికవాడలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు రాకపోకలు సాగించే వాహనాలతో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. లంకెలపాలెం జంక్షన్, ఇ-మర్రిపాలెం, అగనంపూడి, ఆంజనేయ స్వామి కూడలిలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల కాలంలో ఆరు ప్రమాదాలు జరగ్గా... ఐదుగురు మృత్యవాతపడ్డారు పలువురికి గాయాలయ్యాయి.