Share News

అయ్యో పాపం!

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:39 AM

ఓ తల్లి తన నలభై రోజుల పసికందుతో కలిసి అర్ధరాత్రి గోవాడ వద్ద శారదా నదిలో దూకింది. అయితే బిడ్డ నీటిలో గల్లంతుకాగా, తల్లి మాత్రమే క్షేమంగా ఒడ్డుకు చేరింది. ఈమెతోపాటు భర్త కూడా న్యాయవాద వృత్తిలో వున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

అయ్యో పాపం!
పసిబిడ్డ ఆచూకీ కోసం గోవాడ వద్ద శారదా నదిలో గాలిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

పసిబిడ్డతో సహా మహిళా న్యాయవాది ఆత్మహత్యాయత్నం

అర్ధరాత్రి గోవాడ వద్ద శారదా నదిలో దూకిన మహిళ

నీటిలో మునిగిపోయిన పసికందు

స్వల్పగాయాలతో ఒడ్డుకు చేరిన తల్లి

ఆత్మహత్యాయత్నంపై పొంతనలేని మాటలు

చోడవరం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఓ తల్లి తన నలభై రోజుల పసికందుతో కలిసి అర్ధరాత్రి గోవాడ వద్ద శారదా నదిలో దూకింది. అయితే బిడ్డ నీటిలో గల్లంతుకాగా, తల్లి మాత్రమే క్షేమంగా ఒడ్డుకు చేరింది. ఈమెతోపాటు భర్త కూడా న్యాయవాద వృత్తిలో వున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

మాడుగుల మండలం పోతనపూడి అగ్రహారానికి చెందిన శివ అనకాపల్లిలో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. మునగకపాకు చెందిన లీలతో కొనేళ్ల క్రితం వివాహమైంది. ఈమె కూడా న్యాయవాది. భార్యాభర్తలు కొంతకాలంగా చోడవరం కోటవీధిలో నివాసం ఉంటున్నారు. లీల ఇక్కడ కోర్టులో ప్రాక్టీసు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 40 రోజుల క్రితం వీరికి మగబిడ్డ జన్మించాడు. అప్పటి నుంచి లీల ఇంటివద్దే ఉంటున్నది. ఆమెకు సహాయంగా తల్లి, అత్త కూడా ఇక్కడే ఉంటున్నారు. కాగా శనివారం రాత్రి 11 గంటలు దాటిన తరువాత ఎవరికి చెప్పకుండా బిడ్డతో సహా బయటకు వచ్చిన లీల, శివాలయం మీదుగా పంటపొలాల్లో నుంచి నడుచుకుంటూ గోవాడ శారదా నది వంతెన వద్దకు చేరుకుంది. కొద్దిసేపటి తరువాత లీల, బిడ్డ ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళన చెందిన శివ, ఆమె ఫోన్‌ చేశారు. తాను గోవాడ వంతెన వద్ద వున్నానని ఆమె చెప్పడంతో హుటాహుటిన అక్కడకు వెళ్లారు. పసి బిడ్డ కనిపించకపోవడంతో ఏమైందని ప్రశ్నించారు. తనకు బతకాలని లేదని, తాను చనిపోతే బిడ్డను ఎవరుచూస్తారని, అందుకే బిడ్డతో సహా చనిపోదామని నదిలో దూకానని చెప్పింది. అయితే తాను మాత్రం బతికి బయటపడ్డానని, బిడ్డ నదిలో ఉండిపోయిందని చెప్పింది. అనంతరం శివ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ఆదివారం ఉదయం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెళ్లి వంతెన వద్ద నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం సాయంత్రం వరకు పసిబిడ్డ ఆచూకీ లభించలేదు. కాగా ఆమె పొంతనలేని విధంగా తడవకో మాట మాట్లాడుతుండడంతో పోలీసులు విచారిస్తున్నారు. బిడ్డతో సహా నదిలో దూకినట్టు ఆమె చెబుతుండగా, శరీరంపై పెద్దగా గాయాలు లేకపోవడంతో పసిబిడ్డను నదిలో విసిరేసి ఉంటుందని భావిస్తున్నారు. మానసిక సమస్య వల్ల ఈ ఘోరానికి పాల్పడిందా, లేక దంపతుల మధ్య ఏమైనా విభేదాలు వున్నాయా అన్న కోణాల్లో పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఈ సంఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని సీఐ బి.అప్పలరాజు తెలిపారు.

Updated Date - Feb 09 , 2026 | 12:40 AM