గెడ్డ కబ్జాపై అధికారుల మౌనం
ABN , Publish Date - Oct 14 , 2026 | 01:08 AM
ఎండాడలో గెడ్డ స్థలాన్ని ‘గోధ డెవలపర్స్’ తమ ప్రాజెక్టులో కలిపేసుకున్న అంశంపై రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు మౌనం పాటిస్తున్నారు.
రూ.కోట్లు చేతులు మారాయని ప్రచారం
విచారణకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశం
విశాఖపట్నం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):
ఎండాడలో గెడ్డ స్థలాన్ని ‘గోధ డెవలపర్స్’ తమ ప్రాజెక్టులో కలిపేసుకున్న అంశంపై రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు మౌనం పాటిస్తున్నారు. ఆ నిర్మాణ సంస్థ సుమారు 40 మంది నుంచి సర్వే నంబర్లు 69/2ఏ, 69/2బి, 69/3, 69/4ఏ, 69/4బిలలో స్థలాలను సేకరించి భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఆ ప్రాంతంలో గల గెడ్డను కూడా కలిపేసుకుని నిర్మాణం చేపట్టింది. దీనిపై గతంలో అభ్యంతరాలు వ్యక్తం కాగా, పనులు నిలిపివేశారు. తాజాగా మళ్లీ పనులు ప్రారంభించారు. ఇటీవల కురిసిన వర్షానికి గెడ్డ నీరు మొత్తం ఆ ప్రాజెక్టు స్థలంలోకి వెళ్లి...పునాదుల కోసం తీసిన గోతుల్లో నిలిచిపోయింది. దాంతో గోధ ప్రతినిధులు మోటార్లు పెట్టి ఆ నీటిని తోడించారు. గెడ్డ ఆక్రమణపై పర్యావరణవేత్త బొలిశెట్టి సత్య ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. గెడ్డ స్థలం కలిపేసుకున్నారని తేలడంతో పనులు ఆపాల్సిందిగా మౌఖికంగా ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై నోటీసులు జారీచేయకుండా ఉండేందుకు, ఆ తరువాత మళ్లీ ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఒక ప్రభుత్వ శాఖ, మరో ప్రభుత్వ సంస్థకు చెందిన అధికారులకు సుమారు రెండు కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ‘గెడ్డ కబ్జా’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం కథనం ప్రచురించడంతో ప్రాజెక్టు నిర్మాతలు ఉలిక్కి పడ్డారు. తనిఖీలకు రావద్దని జీవీఎంసీ, రెవెన్యూ సిబ్బందిని వేడుకున్నట్టు తెలిసింది. దీంతో ఎవరైనా అడిగితే ‘తాము ఎన్నికల విధుల్లో ఉన్నామని, తరువాత పరిశీలిస్తామని చెబుతామని’ భరోసా ఇచ్చారని సమాచారం. అయితే ‘అంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. గెడ్డను కబ్జా చేస్తే నీరు ఎలా వెళుతుందని, లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని, వెంటనే ఆ ప్రాజెక్టును పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడైనా అధికారులు స్పందించి గెడ్డ స్థలాన్ని కాపాడతారా?, లేదా?...చూడాలి.