Share News

అధికారుల రూటే వేరు..

ABN , Publish Date - Jun 23 , 2026 | 01:04 AM

ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోవడం, అభివృద్ధి పనులను పర్యవేక్షించడం కోసం ప్రభుత్వం అద్దె వాహనాలను సమకూరుస్తున్నది.

అధికారుల రూటే వేరు..

ప్రభుత్వం కల్పించిన వాహన సదుపాయం దుర్వినియోగం

విశాఖ నుంచి రాకపోకలకు మాత్రమే వినియోగిస్తున్న అధికారులు

ఒక్కో కారుకు నెలకు రూ.35 వేలు చెల్లిస్తున్న ప్రభుత్వం

అరుదుగా క్షేత్రస్థాయిలో పర్యటనలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోవడం, అభివృద్ధి పనులను పర్యవేక్షించడం కోసం ప్రభుత్వం అద్దె వాహనాలను సమకూరుస్తున్నది. ఇందుకోసం ప్రతి నెలా లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నది. అయితే కొంతమంది అధికారులు ఈ వాహనాలను క్షేత్రస్థాయి పర్యటనలకు కాకుండా, సొంత అవసరాలకు, విశాఖపట్నం నుంచి రాకపోకలకు వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వివిధ శాఖల జిల్లా స్థాయి అఽధికారులు 45 అద్దె కార్లు వినియోగించుకొనేందుకు ప్రభుత్వం నెలకు ఒక్కో వాహనానికి సుమారు రూ.35 వేలు కేటాయిస్తున్నది. ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు ఈ మొత్తానికి కార్లను అద్దెకు తిప్పలేమంటూ చేతులెత్తేశారు. దీంతో సదరు అధికారి సొంతంగా వాహనం కొనుగోలు చేసుకొని ప్రతినెలా నిర్వహణ, అద్దె కింద రూ.35 వేలు పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. నిబంధనల ప్రకారం వాహనం (కారు) నెలకు కనీసం మూడు వేల కిలో మీటర్లు తిరగాలి. సంబంధిత అధికారి జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతి, ప్రజల ఫిర్యాదులను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ కొందరు అధికారులు జిల్లా ఆవిర్భవించి నాలుగేళ్లు దాటినా.. ఇంకా విశాఖపట్నంలోనే నివాసం ఉంటూ, రోజూ జిల్లా కేంద్రానికి వచ్చి పోతున్నారు. ఈ లెక్కన ఒక కారు రోజుకు 80 నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. నెలలో 25 రోజులు కార్యాలయానికి వస్తే 2,500 కిలోమీటర్లు కేవలం ఉద్యోగి ఇంటి నుంచి కార్యాలయానికి రావడానికే సరిపోతాయి. దీంతో క్షేత్రస్థాయి పర్యటనలు చుట్టంచూపుగా మారాయి.

మండలాల ముఖం చూడని అధికారులు...

జిల్లాలో 24 మండలాలు, రెండు మునిసిపాలిటీలు ఉండగా. కొన్ని శాఖల అధికారులు రోజుల తరబడి క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లిన దాఖలాలు లేవని స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. కార్యాలయాల్లో వెబెక్స్‌ సమావేశాలు, సమీక్షలకే పరిమితమై క్షేత్రస్థాయి పర్యటనలను విస్మరిస్తున్నారని విమర్శిస్తున్నారు.

సమగ్ర శిక్ష అనకాపల్లి జిల్లా కార్యాలయానికి ఏడు అద్దె కార్లు ఉన్నాయి. వీటిలో రెండు వాహనాలు రోజూ ఉదయం ఉద్యోగులను విశాఖపట్నం నుంచి అనకాపల్లి తీసుకొచ్చి, మళ్లీ సాయంత్రం విశాఖ తీసుకెళ్లేందుకు వినియోగిస్తున్నట్టు తెలిసింది. ఏఎంఓలకు కేటాయించాల్సిన వాహనాలను కార్యాలయ సిబ్బంది సొంత అవసరాలకు వినియోగిస్తున్నారు. పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, డ్వామా, వ్యవసాయ శాఖల అధికారులు అద్దె కార్లలోనే విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. పలువురు జిల్లా అధికారులను ప్రభుత్వం మండల ప్రత్యేకాధికారులుగా నియమించింది. వీరు తమకు కేటాయించిన మండలానికి వారంలో కనీసం రెండుసార్లు వెళ్లాలి. కానీ నెల మొత్తం మీద ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే వెళ్లి వస్తున్నారు.

ప్రజాధనం వృథా

ప్రజలు చెల్లిస్తున్న పన్నుల సొమ్ముతో అధికారుల అద్దె వాహనాల బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం... వాటి వినియోగంపై సరైన పర్యవేక్షణ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనాల లాగ్‌బుక్స్‌, జీపీఎస్‌ వివరాలను పరిశీలిస్తే ఆయా వాహనాలు జిల్లాలో ఎంత మేర తిరుగుతున్నాయో స్పష్టం అవుతుందని పలువురు సూచిస్తున్నారు. అయితే అధికారులు వాడుతున్న వాహనాలకు జీపీఎస్‌ డివైస్‌లు లేకపోవడంతో వాహనాల మూవ్‌మెంట్‌ తెలుసుకునే అవకాశం లేకపోయింది.

ఇదిలాఉండగా అధికారులకు వాహనాలకు అద్దె బిల్లులను ప్రతినెలా సమర్పిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు కేటాయించకపోవడంతో నెలల తరబడి బిల్లులు ఖజానాల్లో పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడు బిల్లులు క్లియర్‌ అవుతున్నాయి. ఈ కారణంతో కూడా అధికారులు వాడుతున్న అద్దె వాహనాలపై ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ ఉండడం లేదని సమాచారం.

Updated Date - Jun 23 , 2026 | 01:04 AM