అధికారుల మొద్దు నిద్ర
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:06 AM
జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కబ్జాను ఆడ్డుకోవలసిన అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో కొందరు రియల్టర్లు దర్జాగా ప్రభుత్వ భూములను కలిపేసుకుని లేఅవుట్లు వేసేస్తున్నారు. కొండవాగులను కూడా ఆక్రమించి రోడ్లు వేసుకుంటున్నారు. అయితే అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనా జిల్లా యంత్రాంగం మొద్దునిద్ర
- ప్రభుత్వ భూమిని కబ్జా చేసి లేఅవుట్ ఏర్పాటు
- రెండేళ్లుగా జోరుగా ప్లాట్‌ల విక్రయాలు
- కొండవాగు ఆక్రమించి రోడ్డు నిర్మాణం
- ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోని అధికారులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కబ్జాను ఆడ్డుకోవలసిన అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో కొందరు రియల్టర్లు దర్జాగా ప్రభుత్వ భూములను కలిపేసుకుని లేఅవుట్లు వేసేస్తున్నారు. కొండవాగులను కూడా ఆక్రమించి రోడ్లు వేసుకుంటున్నారు. అయితే అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనకాపల్లి మండలం బవులువాడ గ్రామంలో సీతమ్మకాలనీకి ఆనుకొని వున్న ప్రభుత్వ భూమిని కొందరు రెండేళ్ల క్రితం కలిపేసుకొని అక్రమ లేఅవుట్ వేసి దర్జాగా అమ్మేసుకుంటున్నారు. బవులువాడ గ్రామంలో సర్వే నంబర్లు 39, 40, 42లలోని జిరాయితీ భూమిలో సుమారు 4 ఎకరాల్లో ఒక అనధికార లేఅవుట్ వెలిసింది. దీనికి ఆనుకొని సర్వే నంబరు 41/14లో 36 సెంట్లు, అదే విధంగా సర్వే నంబరు 41/15లో సుమారు 63 సెంట్లు కలిపి మొత్తం 99 సెంట్లు కొండపోరంబోకు ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలంపై కన్నేసిన రియల్టర్లు ప్రభుత్వ భూమిని లేఅవుట్‌లో కలిపేసుకొని ప్లాట్‌లు వేశారు. అనకాపల్లి నుంచి వయా వెంకన్నపాలెం, చోడవరం వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డుకు సమీపంలో ఈ స్థలం ఉండడంతో ధర ఎక్కువగానే పలుకుతోంది. ఇక్కడ సెంటు భూమి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ధర పలుకుతోంది. దీంతో జిరాయితీ భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసిన రియల్టర్లు ఎటువంటి పంచాయతీ అనుమతి పొందకుండానే వెంచర్ వేశారు. అంతటితో ఆగకుండా సమీపంలోని 99 సెంట్ల కొండ పోరంబోకు స్థలాన్ని కబ్జా చేసి దర్జాగా ప్లాట్‌లు వేసి అమ్ముకున్నారు. వెంచర్‌కు మెయిన్ రోడ్డు నుంచి సరైన రోడ్డు లేకపోవడంతో సమీపంలో ఉన్న స్టోన్ క్రషర్ల యాజమాన్యాలతో కలిసి సుమారు అర కిలోమీటరు పొడవున కొండవాగు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి రోడ్డు వేశారు. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి వివరాలు ప్రభుత్వ కొండపోరంబోకు రాస్తాగా నమోదై వుంది. గ్రామానికి చెందిన కొందరు చోటా నాయకులతో కుమ్మక్కై ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాన్ని, సమీపంలోని కొండవాగు భూమిని ఆక్రమించి లేఅవుట్, రోడ్డు వేసుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ భూ ఆక్రమణపై కూటమి ప్రభుత్వం వచ్చాక విచారణ జరిపిస్తామని కొందరు నాయకులు గతంలో ప్రకటనలు చేసినా ఇప్పుడు మిన్నకుండిపోవడం అనుమానాలకు తావిస్తోంది. పైగా భూ ఆక్రమణదారులతో కుమ్మక్కై అక్రమ లేఅవుట్‌లోని రెండు ప్లాట్‌లలో కూటమి నాయకుడు ఒకరు గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. దీనిపై తహశీల్దారు, ఆర్డీవోకు గతంలో కొందరు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఫిర్యాదు ఇచ్చిన వారి వివరాలను భూ ఆక్రమణదారులకు చేరవేసినట్టు తెలిసింది.. తాజాగా ప్రభుత్వ భూమి కబ్జాపై స్థానికులు రెవెన్యూ అధికారులకు, సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.