Share News

పీజీఆర్‌ఎస్‌కు అధికారులు విధిగా హాజరు కావాలి

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:35 PM

స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కి జిల్లా స్థాయి అధికారులంతా విధిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి ఆదేశించారు.

పీజీఆర్‌ఎస్‌కు అధికారులు విధిగా హాజరు కావాలి
ఐటీడీఏ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ టి.నిశాంతి, ఇన్‌చార్జి జేసీ శ్రీపూజ

జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి ఆదేశం

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో 136 వినతులు స్వీకరణ

పాడేరు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కి జిల్లా స్థాయి అధికారులంతా విధిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం)లో ఆమెఅధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఏదైనా కారణాలతో పీజీఆర్‌ఎస్‌కు హాజరుకాని అధికారులు ముందస్తు అనుమతి పొందాలన్నారు. రెండు జిల్లాల్లో ఇన్‌చార్జి అధికారులుగా పనిచేస్తున్న వారు మూడు రోజులు ఇక్కడ, మరో మూడు రోజులు ఆ జిల్లాలో పనిచేయాలన్నారు. శాఖపరమైన ఎటువంటి అనుమతినైనా సంబంధిత ఉన్నతాధికారి వచ్చి విధిగా అనుమతి పొందాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో శాఖలకు చెందిన అధికారులు మాత్రమే ఉండాలని, సిబ్బందితో సరిపెట్టకూడదన్నారు. ప్రతి సోమవారం జిల్లా అభివృద్ధిపై నిర్వహించే సమీక్షకు సంబంధించిన పక్కా ప్రణాళికతో హాజరుకావాలన్నారు. సంబంధిత అధికారులను సీపీవో సమన్వయం చేసుకోవాలన్నారు. గ్రామ, మండల స్థాయిల్లో సమస్యలపై ప్రజలు జిల్లా కేంద్రానికి రాకూడదని, వాటిని మండల స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించాలన్నారు. అలాగే ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో పీజీఆర్‌ఎస్‌ నిర్వహించాలని, అధికారులంతా విధిగా హాజరుకావాలని, లేకుంటే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ హెచ్చరించారు. సమస్యలపై ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించి, వాటికి కచ్చితమైన పరిష్కారం చూపాలన్నారు. ఈక్రమంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు. అలాగే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల పేషీల నుంచి వచ్చే అర్జీలను గడువులోగా పరిష్కరించాలన్నారు. మీకోసం అర్జీల పరిష్కారం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్‌ సేవలపై ప్రజల నుంచి ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తున్నదని, పొరపాట్లు లేకుండా ఆయా సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి, ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ, డీఆర్‌వో నీలకంఠం, ఆర్‌డీవో ఎంవీఎస్‌.లోకేశ్వరరావు గిరిజనుల నుంచి 136 వినతులను స్వీకరించారు.

1100 సేవలు సద్వినియోగం చేసుకోవాలి

అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి నోచుకోకుంటే 1100 నంబర్‌కు ఫోన్‌ చేసి సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, డీఎంహెచ్‌వో కృష్ణమూర్తినాయిక్‌, జిల్లా పరిశ్రమల శాఖాధికారి రమణారావు, డీఈవో రామకృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, హౌసింగ్‌ పీడీ బి.బాబు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్‌ , ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ వీబీ.నాగేశ్వరరావు, స్వర్ణ గ్రామ శాఖ జిల్లా నోడల్‌ అధికారి పీఎస్‌.కుమార్‌, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, నేషనల్‌ హైవే డీటీ వి.ధర్మరాజు, సీపీవో ప్రసాద్‌, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, పరిపాలనాధికారి ఎం.హేమలత, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 11:35 PM