ఊటగెడ్డ రిజర్వాయర్ కబ్జా
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:03 AM
పరిశ్రమల కోసం కొండపోరంబోకు భూములను ప్రభుత్వం కేటాయిస్తుండడంతో, మిగిలిన భూములపై ఆక్రమణదారుల కన్ను పడింది. కొండపోరంబోకు భూములతో పాటు సాగునీటి రిజర్వాయర్ భూములను సైతం కబ్జా చేస్తున్నారు.
20 ఎకరాలను చదును చేసిన ఆక్రమణదారులు
మామిడి, జీడిమామిడి, సరుగుడు మొక్కలు వేయడానికి సన్నద్ధం
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసిన ఆయకట్టు రైతులు
మాకవరపాలెం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల కోసం కొండపోరంబోకు భూములను ప్రభుత్వం కేటాయిస్తుండడంతో, మిగిలిన భూములపై ఆక్రమణదారుల కన్ను పడింది. కొండపోరంబోకు భూములతో పాటు సాగునీటి రిజర్వాయర్ భూములను సైతం కబ్జా చేస్తున్నారు.
మండలంలోని రాచపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబరు 737లో సుమారు 1,620 ఎకరాల కొండపోరంబోకు భూములు వున్నాయి. ఒక సర్వే నంబరులో ఇంత పెద్దమొత్తంలో ప్రభుత్వం భూములు జిల్లాలో మరెక్కడా లేవు. ఈ సర్వే నంబరు పరిధిలో ఎరకన్నపాలెం, రామన్నపాలెం, చినరాచపల్లి, వెంకయ్యపాలెం గ్రామాలు ఉన్నాయి. ఇందులో కొంత భూమిని ఆయా గ్రామాల రైతులు ఆక్రమించుకుని మాడిడి, జీడిమామిడి తోటలు సాగు చేసుకుంటూ ఫలసాయాన్ని పొందుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 737 సర్వే నంబరులో రైతుల సాగులో ఉన్న 410 ఎకరాలను పరిశ్రమల ఏర్పాటు కోసం సేకరించింది. ఎప్పటి నుంచో సాగుదారులుగా వున్న చిన్న, సన్నకారు రైతులకు నిబంధనల మేరకు పరిహారం ఇవ్వనున్నట్టు అధికారులు ప్రకటించారు. కాగా ఇదే సర్వే నంబరులో సుమారు 55 ఎకరాల్లో 2004వ సంవత్సరంలో నాడు మంత్రిగా ఉన్న ప్రసుత్త స్పీకర్ అయ్యన్నపాత్రుడు సుమారు రూ.88 లక్షలు మంజూరు చేయించి ఊటగెడ్డ రిజర్వాయర్‌ను నిర్మింపజేశారు. ప్రసుత్తం పరిశ్రమల కోసం ప్రభుత్వం తీసుకున్న 410 ఎకరాల భూమికి ఎగువున ఈ రిజర్వాయర్ ఉంది. మిగిలిన భూమి రిజర్వాయర్‌కు ఎగువున ఉంది. భవిష్యత్తులో రిజర్వాయర్‌కు ఎగువున్న ఉన్న భూమిని కూడా ప్రభుత్వం తీసేసుకుని, నష్టపరిహారం ఇస్తుందనే ఉద్దేశంతో పలువురు ఆక్రమించుకుంటున్నారు. రిజర్వాయర్ విస్తీర్ణం 55 ఎకరాలు కాగా ఇందులో సుమారు 20 ఎకరాలను ఆక్రమించి దున్నేశారు. ఇందులో సరుగుడు, జీడిమామిడి, మామిడి మొక్కలు వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదేళ్ల కిందట రిజర్వాయర్ కుడివైపున ఉన్న భూమిని ఆక్రమించి మామిడి తోటలు వేశారు. సర్వే నంబరు 737లోని ప్రభుత్వ భూములు ఆక్రమణను గురవుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడంత పలు అనుమానాలకు తావిస్తున్నది. ఊటగెడ్డ రిజర్వాయర్‌ను సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలంటూ ఇటీవల ఆయకట్టు రైతులు అనకాపల్లి వెళ్లి కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు ఏ అధికారి కూడా ఇటువైపు రాలేదు.