Share News

భోగాపురంలో ప్రోటోకాల్‌కూ అడ్డంకులు

ABN , Publish Date - Sep 10 , 2026 | 01:39 AM

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ ప్రోటోకాల్‌ ఆహ్వానాలకు యాజమాన్య ప్రతినిధులు అడ్డం పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

భోగాపురంలో  ప్రోటోకాల్‌కూ  అడ్డంకులు

విశాఖపట్నం అధికారులకు

పాస్‌లు ఇవ్వని ఎయిర్‌పోర్టు నిర్వాహకులు

ఫోన్‌లు కూడా లిఫ్ట్‌ చేయని వైనం

ఉన్నతాధికారుల దృష్టికి సమస్య

విశాఖపట్నం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి):

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ ప్రోటోకాల్‌ ఆహ్వానాలకు యాజమాన్య ప్రతినిధులు అడ్డం పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

విశాఖపట్నం వచ్చే ప్రముఖులు, ఆహ్వానితులు, అతిథులు అంతా భోగాపురం విమానాశ్రయంలోనే దిగుతుంటారు. విమానం దిగిన తరువాత వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున, వివిధ సంస్థల తరపున కొందరు అధికారులు, ప్రతినిధులు టెర్మినల్‌లో స్వాగతం పలకాలి. ఇలాంటి సమయాల్లో ఎవరు వస్తున్నారు? వారికి ఎవరు ఆహ్వానం పలుకుతున్నారో విమానాశ్రయం నిర్వాహకులకు తెలియజేస్తే అవసరమైనన్ని పాస్‌లు మంజూరుచేస్తారు. విశాఖపట్నం విమానాశ్రయంలో మొన్నటివరకూ అలాగే జరిగేది. ఇప్పుడు భోగాపురంలో ప్రజా ప్రతినిధుల వరకు స్వాగతాలు బాగానే జరుగుతున్నాయి. అధికారులు, వివిధ సంస్థలు ఆహ్వానించిన వారికి స్వాగతం పలికేందుకు మాత్రం విమానాశ్రయం సీఈఓ ప్రోటోకాల్‌ అనుమతులు ఇవ్వడం లేదు. గత కొద్దిరోజులుగా దీనిపై అటు విజయనగరం అధికారులు, ఇటు విశాఖపట్నం జిల్లా అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖపట్నం నోవాటెల్‌ హోటల్‌లో గురువారం నుంచి ఇండియా అసోసియేషన్‌ ఆఫ్‌ టూర్‌ ఆపరేటర్స్‌ (ఐఏటీఓ) సదస్సు జరగనుంది. దీనికి దేశం నలుమూలల నుంచి వేయి మందికి పైగా ఆహ్వానితులు వస్తున్నారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు గజేంద్ర షెకావత్‌, రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారు. ఈ సదస్సు కోసం ఐఏటీఓ జాతీయ స్థాయి నాయకులు మంగళవారం రాత్రే విశాఖపట్నం చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి పర్యాటక శాఖ అధికారులు ప్రోటోకాల్‌ స్వాగతం పలకాల్సి ఉంది. ఇందుకు అవసరమైన పాస్‌ల కోసం విశాఖ జిల్లా పర్యాటక శాఖాధికారులు విమానాశ్రయం సీఈఓకి ఫోన్లు చేస్తే కనీసం లిఫ్ట్‌ చేయలేదు. దాంతో విజయవాడ నుంచి కూడా ఏపీటీడీసీ అధికారులు ప్రయత్నం చేశారు. వారి ఫోన్లకు కూడా స్పందించలేదు. వారు సమస్యను విజయనగరం కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన కల్పించుకుని మాట్లాడాక గానీ పాస్‌లు ఇవ్వలేదు. ఇంతకు ముందు కూడా రెండు, మూడు సార్లు ఇలాగే చేశారని, ఫోన్‌ కాల్స్‌కు సీఈఓ గానీ, ఇతర సిబ్బంది గానీ స్పందించడం లేదని విశాఖ జిల్లా అధికారులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం నుంచి విశాఖలో ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ ఎక్స్‌పో మూడు రోజులు జరగనుంది. దీనికి కూడా వీఐపీలు వస్తున్నారు. వారు కూడా ప్రొటోకాల్‌ పాస్‌ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంకా చేతికి రాలేదు. విశాఖపట్నం విమానాశ్రయం నేవీ అధ్వర్యంలో నడిచినా ఎప్పుడూ ప్రోటోకాల్‌ స్వాగతాలకు ఇబ్బందులు ఎదురుకాలేదని, భోగాపురం విమానాశ్రయంలో జీఎంఆర్‌ యాజమాన్యం మాత్రం ఎవరికీ అందుబాటులో ఉండడం లేదని, ఫోన్లకు సమాధానం ఇవ్వడం లేదని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ పద్ధతి మార్చుకోవాలని వారంతా సూచిస్తున్నారు.

Updated Date - Sep 10 , 2026 | 01:39 AM