Share News

ప్లాస్టిక్‌ రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:19 AM

జిల్లాలో కొత్త పద్ధతిలో చేపట్టాల్సిన రహదారి నిర్మాణానికి అవాంతరాలు ఎదురయ్యాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్లే అవసరమైన సామగ్రి అందుబాటులో లేక రహదారి నిర్మాణానికి జాప్యం జరుగుతోంది.

ప్లాస్టిక్‌ రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు
ప్లాస్టిక్‌ వ్యర్థాలతో అభివృద్ధి చేయనున్న వెంకన్నపాలెం, లింగాలతిరుగుడు రహదారి ఇదే..

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో డానిష్‌ ఫైబర్‌ మెటీరియల్‌ సరఫరాకు బ్రేక్‌

ప్రారంభంకాని వెంకన్నపాలెం-లింగాల తిరుగుడు పనులు

చోడవరం, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్త పద్ధతిలో చేపట్టాల్సిన రహదారి నిర్మాణానికి అవాంతరాలు ఎదురయ్యాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్లే అవసరమైన సామగ్రి అందుబాటులో లేక రహదారి నిర్మాణానికి జాప్యం జరుగుతోంది. ప్రతి జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఒక రోడ్డు ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మండల పరిధిలోని చోడవరం నుంచి విశాఖపట్నం వెళ్లే రహదారిలో వెంకన్నపాలెం జంక్షన్‌ నుంచి సబ్బవరం పరిధి లింగాలతిరుగుడు వరకు 8.6 కిలోమీటర్ల రోడ్డును ప్లాస్టిక్‌ వ్యర్థాలతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలతో చేపట్టే పనుల వల్ల ఖర్చు తక్కువ కావడంతో పాటు రోడ్డు త్వరగా పాడయ్యే అవకాశం ఉండదు. ఈ రహదారికి రూ.3.5 కోట్లను ప్రభుత్వం గత అక్టోబరు నెలలోనే విడుదల చేసి, టెండర్లు కూడా ఖరారు చేసింది.

పశ్చిమాసియా దేశాల యుద్ధం ప్రభావం

ఈ రోడ్డు పనులు ఇటీవల ప్రారంభం అవుతాయనుకున్న సమయానికి, రోడ్డు నిర్మాణంలో తారులో కలిపి ఉపయోగించే డానిష్‌ ఫైబర్‌ మెటీరియల్‌ సరఫరాకు పశ్చిమాసియా దేశాల యుద్ధం సెగ తగిలిందని అధికారవర్గాల సమాచారం. ప్రస్తుతం యుద్ధంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతుండడంతో ఈ సామగ్రి వచ్చిన తరువాత మాత్రమే రోడ్డు పనులు ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. నిధులు మంజూరై, టెండరు కూడా ఖరారైనా రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ రహదారి పనులకు సంబంధించి తారులో ఉపయోగించే మెటీరియల్‌ గల్ఫ్‌ దేశాల నుంచి రావలసి ఉందని, ఆ మెటీరియల్‌ వచ్చిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని ఆర్‌అండ్‌బీ ఈఈ సాంబశివరావు తెలిపారు.

Updated Date - Apr 12 , 2026 | 12:19 AM