Share News

మరుగుదొడ్ల అద్దెపై అభ్యంతరం

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:28 AM

‘యోగాంధ్ర’ సందర్భంగా ఏర్పాటుచేసిన బయో టాయిలెట్లకు అద్దె చెల్లింపుపై జీవీఎంసీ అధికారులు అడ్డగోలుగా చేసిన ప్రతిపాదనను స్టాండింగ్‌ కమిటీ తిరస్కరించింది.

మరుగుదొడ్ల అద్దెపై అభ్యంతరం

చెల్లింపు ప్రతిపాదనను వాయిదా వేసిన స్టాండింగ్‌ కమిటీ

మరో 109 అంశాలకు ఆమోదం

కొన్ని అంశాల్లో అవినీతి ఉన్నా గ్రీన్‌సిగ్నల్‌

కమీషన్లు అందడమే కారణమని ఆరోపణలు

విశాఖపట్నం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి):

‘యోగాంధ్ర’ సందర్భంగా ఏర్పాటుచేసిన బయో టాయిలెట్లకు అద్దె చెల్లింపుపై జీవీఎంసీ అధికారులు అడ్డగోలుగా చేసిన ప్రతిపాదనను స్టాండింగ్‌ కమిటీ తిరస్కరించింది. ఆయా అంశాలపై అభ్యంతరాలు ఉన్నందున వచ్చే సమావేశంలో చర్చిద్దామని ప్రకటించింది. మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ప్రధాన అజెండాగా 87 అంశాలు, టేబుల్‌ అజెండాగా 52 అంశాలను ప్రతిపాదించారు. ఒక్కో బయో టాయిలెట్‌కు రూ.6,600 నుంచి రూ.16,200 అద్దె చెల్లింపు, భీమిలి జోన్‌ నుంచి కాపులుప్పాడ డంపింగ్‌ యార్డుకు చెత్త తరలించేందుకు వినియోగిస్తున్న 17 వాహనాలకు రూ.47.15 లక్షలతో మరమ్మతులు సహా 29 అంశాలను కమిటీ వాయిదా వేసింది. ఆయా అంశాలకు సంబంధించిన అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైందని, అందులో అనుమానాలు సహేతుకంగా ఉన్నందున సమగ్ర వివరాలు సమర్పించాలని సభ్యులు కోరగా, వాటిని వాయిదా వేస్తున్నట్టు మేయర్‌ ప్రకటించారు. అయితే ఆయా అంశాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు ఎవరూ తమను కలవలేదని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ చేయించి వాటిని ఆమోదించేలా చూడాలని సిఫారసు చేయించడం వల్లే పత్రికల్లో కథనాలు వచ్చాయని చెప్పి వాయిదా వేశామని ఒకరిద్దరు అంతర్గతంగా వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరుగుతోంది. స్టాండింగ్‌ కమిటీ ఆమోదించిన 109 అంశాల్లో దుకాణాలు అద్దెలు, వార్డుల్లో అభివృద్ధి పనులు, పారిశుధ్య సిబ్బంది జీతాలు చెల్లింపు అంశాలు ఉన్నాయి. కొన్నింటిపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కమిటీ వాటిని ఆమోదించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా కాంట్రాక్టర్లు శుక్రవారం ఉదయాన్నే జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చి స్టాండింగ్‌ కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు మహిళా కార్పొరేటర్ల కుటుంబసభ్యులు, మరొక కార్పొరేటర్‌తో చర్చలు జరిపి పది శాతం చొప్పున కమీషన్‌ను చేతిలో పెట్టినందునే వాటిపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆమోదించేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Jan 03 , 2026 | 12:28 AM