నేడు ప్రమాణం
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:34 AM
జీవీఎంసీ నూతన కార్యవర్గం సోమవారం కొలువుదీరనుంది.
కొలువుదీరనున్న జీవీఎంసీ నూతన కార్యవర్గం
మేయర్ మినహా కార్పొరేటర్లంతా ప్రమాణ స్వీకారం
మూడునెలల్లోగా ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం చేసేందుకు మేయర్‌కు ఈసీ అనుమతి
డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్న కార్పొరేటర్లు
ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్ కేతన్‌గార్గ్
విశాఖపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ నూతన కార్యవర్గం సోమవారం కొలువుదీరనుంది. మేయర్ మినహా 120 మంది కార్పొరేటర్లతో జీవీఎంసీ ప్రత్యేక అధికారి హోదాలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మేయర్‌గా ఎన్నికైన ముక్కా శ్రావణి తండ్రి ఇటీవల మృతిచెందడంతో ఆమె ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. మూడునెలల్లోగా జరిగే తదుపరి సమావేశంలో మేయర్ ప్రమాణస్వీకారం చేసుకునేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మల్లికార్జున ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.
జీవీఎంసీకి గతనెల 30న జరిగిన ఎన్నికల్లో మేయర్‌గా టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి గెలుపొందగా, 120వార్డుల్లో టీడీపీ 64, జనసేన 26, బీజేపీ ఎనిమిది, వైసీపీ 13, సీపీఎం ఒకటి, ఇండిపెండెంట్‌లు ఎనిమిది వార్డులో గెలుపొందిన విషయం తెలిసిందే. విజయం సాధించిన కార్పొరేటర్లతో ఈనెల 23న ప్రమాణస్వీకారం చేయించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో జీవీఎంసీ అధికారులు ఏర్పాట్లుపూర్తిచేశారు. కాగా మేయర్‌గా ఎన్నికైన ముక్కా శ్రావణి తండ్రి ముక్కా ముత్యాలనాయుడు ఇటీవల మృతిచెందడంతో ఆమె ఆ విషాదం నుంచి తేరుకోలేదు. దీంతో ఆమె మినహా 120 మంది కార్పొరేటర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియను ప్రత్యేక అధికారి చేపడతారు. కౌన్సిల్ తొలి సమావేశాన్ని నిర్వహించేందుకు జీవీఎంసీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఏర్పాట్లను కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదివారం పరిశీలించారు.
డిప్యూటీ మేయర్ శివ ప్రసాద్
ప్రకటించిన జనసేన అధిష్ఠానం
నేడు ఎన్నుకోనున్న కార్పొరేటర్లు
విశాఖపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించారు. దీంతో పార్టీ అధిష్ఠానం 37వ వార్డు కార్పొరేటర్ పందిరి వెంకట శివప్రసాద్ పేరును ఆదివారం అర్ధరాత్రి ఖరారు చేసింది. జీవీఎంసీ కొత్తకార్యవర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా మేయర్ పదవిని టీడీపీకి కేటాయించడంతో డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు దక్కింది. కౌన్సిల్‌లో టీడీపీ తర్వాత అత్యధికంగా జనసేనకు 26 మంది కార్పొరేటర్లు ఉండడంతో ఆది నుంచీ డిప్యూటీ మేయర్ పదవి తమకే కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరారు. బీజేపీకి కేవలం ఎనిమిది మంది కార్పొరేటర్లు మాత్రమే ఉండడంతో ఆ పార్టీ నేతలు కూడా జనసేన ప్రతిపాదనకు అంగీకరించారు.
ముందే ప్రకటించిన ఎమ్మెల్యే
జనసేనకు చెందిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శనివారం విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ పదవి జనసేనకే కేటాయించారని స్పష్టం చేయడంతో కూటమి పార్టీలతోపాటు కార్పొరేటర్లలో అను మానాలు తొలగిపోయాయి. అయితే ఆ పార్టీ నుంచి ఈ పదవిని ఆశిస్తున్నవారి సంఖ్య భారీగా ఉండడంతో ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికి అప్పగించారు. దీంతో పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్న 37వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన శివప్రసాద్‌ను ఎంపిక చేసింది. ఇతనిపై పార్టీ అధిష్ఠానానికి సానుకూల అభిప్రాయం ఉండడంతో ఆయనకే అవకాశం దక్కుతుందని అందరూ అంచనా వేశారు. అయితే యాదవ సామాజికవర్గానికి డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించాలని తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఈ క్రమంలో 31వ వార్డు కార్పొరేటర్ మన్యాల శ్రీనివాస్ ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు జీవీఎంసీ గత కౌన్సిల్‌లో డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన 93వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరాజు పదవిని ఆశించారు. అయితే పార్టీ అధిష్ఠానం శివప్రసాద్ వైపు మొగ్గుచూపింది. కాగా జీవీఎంసీలో కూటమికి పూర్తిస్థాయి మెజారిటీ ఉండడంతో శివప్రసాద్ ఎన్నిక లాంఛనమేనని చెబుతున్నారు.