నూకాలమ్మ ఉత్సవం
ABN , Publish Date - Mar 17 , 2026 | 01:32 AM
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు దేవదాయ శాఖ, ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
నేటి రాత్రి అమ్మవారి కొత్త అమావాస్య జాతర ప్రారంభం
దేవదాయ శాఖ, ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు
భక్తులు ఎండబారిన పడకుండా చలువ పందిళ్లు
ఉచితంగా తాగునీరు, మజ్జిగ
అమ్మవారికి రేపు పట్టువస్త్రాలు సమర్పించనున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర
అనకాపల్లి టౌన్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు దేవదాయ శాఖ, ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి ఏడు గంటలకు మొదలయ్యే ఈ జాతరను వచ్చే నెల 17వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా సకల ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచివుండే భక్తులు ఎండబారిన పడకుండా తాటాకులతో చలువ పందిళ్లు వేశారు. మంచినీరు, మజ్జిగను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. కొత్త అమావాస్య రోజైన బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అమ్మవారి జాతర సందర్భంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, భక్తులు ఇబ్బంది పడకుండా పోలీసు శాఖ విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేట్టింది.
స్థానిక నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు దేవదాయ శాఖ, ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి ఏడు గంటలకు మొదలయ్యే ఈ జాతరను వచ్చే నెల 17వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. జాతీయ రహదారిలోని నూకాంబిక ఆలయ ముఖద్వారం నుంచి సంతబయలు మీదుగా ఆలయం వరకు దారి పొడువునా స్వాగత ద్వారాలు, విద్యుత్ సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం సందర్భంగా ఎక్కడా తోపులాట, తొక్కిసలాటకు తావివ్వకుండా ఆలయ ఆవరణలో స్టీల్ బారికేడ్లతో క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భక్తులు ఎండబారిన పడకుండా ఆలయ ఆవరణతోపాటు రహదారిపైనా తాటాకులతో చలువ పందిళ్లు వేశారు. ఆలయ ఆవరణమంతా షామియానాలు వేసి, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. క్యూ లైన్లలో భక్తులకు ఉచితంగా మంచినీరు, మజ్జిగ పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశారు. చంటిపిల్లలకు పాలు, బిస్కెట్లు సిద్ధం చేశారు. మంగళవారం రాత్రి ఏడు గంటలకు సంప్రదాయ రీతిలో జాతరను ప్రారంభిస్తారు. కొత్త అమావాస్య రోజైన బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేశ్, స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఇతర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ వర్గాలు తెలిపాయి.
అమ్మవారి స్థల పురాణం
సుమారు 600 సంవత్సరాల కిందట నూకాంబిక అమ్మవారు ఇక్కడ కాకతాంబగా వెలసినట్టు చరిత్ర చెబుతున్నది. అప్పటి ఆర్కాట్ నవాబు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసిన కాకర్లపూడి అప్పలరాజు కళింగ ఆంధ్ర ప్రభువైన బహుబలేంద్రుడుని ఓడించి అనకాపల్లి కేంద్రంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటి గవరపాలెం ప్రాంతంలో శతృదుర్భేధ్యమైన కోటను నిర్మించి, దీనికి దక్షిణం వైపున తమ ఇలవేల్పు కాకతాంబకు ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో విజయనగరం రాజులు కాకతాంబ పేరును నూకాంబిక అమ్మవారి మార్చారు. గోడి జగన్నాథరావురాజును అనకాపల్లి కోటకు సామంతరాజుగా విజయనగరం రాజులు నియమించారు. ఆయన ఏళ్ల తరబడి బ్రిటిష్ పాలకులకు పన్నులు చెల్లించకపోవడంతో కోటను వేలం వేయగా.. వైరిచర్ల ఆనంద గజపతిరాజు వేలం పాటలో కోటను సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి స్వాతంత్య్రం వచ్చే వరకు వైరిచర్ల వంశీయులు దేవస్థాన శాశ్వత ధర్మకర్తలుగా వ్యవహరించారు. నూకాంబిక అమ్మవారి దేవాలయం 1951లో దేవదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. ఏటా ఫాల్గుణ బహుళ అమావాస్య (ఉగాది ముందు రోజు) నుంచి చైత్ర బహుళ అమావాస్య వరకు నెల రోజుల పాటు అమ్మవారి జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, నూకాంబిక అమ్మవారి ఆలయ విశిష్టతను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ల దృష్టికి తీసుకెళ్లడంతో గత ఏడాది నుంచి నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారు.
భారీ పోలీసు బందోబస్తు, వాహనాల పార్కింగ్
కొత్త అమావాస్య జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా ఆదేశాల మేరకు అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక సమస్య తలెత్తకుండా పలుచోట్ల వాహనాలకు పార్కింగ్ స్థలాలను కేటాయించారు. పరవాడ, తోటాడ వైపు నుంచి వచ్చే వారు తమ వాహనాలను జాతీయ రహదారి దగ్గర గోల్డ్‌స్పాట్ పార్కింగ్ స్థలంలో, నూకాంబిక ముఖద్వారం వైపు నుంచి వచ్చే వాహనాలు సీతారామ ఫైర్‌వర్క్స్ దగ్గర ఇరువైపులా ఉన్న స్థలాలు, కొబ్బరి తోటలు, బరియల్ గ్రౌండ్ వెనుక ఉన్న స్థలాల్లో వాహనాలను నిలుపుదల చేసుకోవాలి. అనకాపల్లి పట్టణం, పూల్‌బాగ్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు పూలతోట వద్ద గల ఖాలీషా మటన్ షాపు వద్ద, జీవీఎంసీ వాటర్ ట్యాంకు, పీవీఆర్ సంయుక్త అపార్టుమెంట్‌కు ఎదురుగా ఉన్న రామాలయం, సత్యగ్రాండ్ ఎదురుగా ఉన్న స్థలాలను ఉపయోగించుకోవాలి. పెరుగుబజార్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను డీసీఎంఎస్ స్థలం, జీసీఎంసీ ఇండోర్‌స్టేడియం వద్ద పార్కింగ్ చేసుకోవాలి. వీవీఐపీలు భాస్కరరావు ప్రైవేట్ పార్కింగ్ స్థలాన్ని ఉపయోగించుకోవాలి. వాహనదారులు, భక్తులు పోలీసు శాఖకు సహకరించాలని ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటనారాయణ కోరారు.
ఏర్పాట్లు పూర్తి
పీలా నాగశ్రీను, చైర్మన్, నూకాంబిక ఆలయం
నెల రోజులపాటు జరిగే నూకాంబిక అమ్మవారి జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశాం. భక్తులు ఎండబారిన పడకుండా చలువ పందిళ్లు వేయించాం. జాతర ప్రారంభం రోజైన మంగళవారం రాత్రి నేలవేషాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. భక్తులకు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తాం. రోజూ వెయ్యి మందికి అన్నప్రసాద వితరణ వుంటుంది.