Share News

ఎన్‌టీటీ డేటా కార్యాలయం ప్రారంభం

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:59 AM

రుషికొండ ఐటీ హిల్‌ నంబరు -2లో ఎన్‌టీటీ డేటా బిజినెస్‌ సొల్యూషన్స్‌ కార్యాలయం 300 మంది ఉద్యోగులతో గురువారం ప్రారంభమయింది.

ఎన్‌టీటీ డేటా కార్యాలయం ప్రారంభం

విధుల్లో 300 మంది ఉద్యోగులు

విశాఖపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి):

రుషికొండ ఐటీ హిల్‌ నంబరు -2లో ఎన్‌టీటీ డేటా బిజినెస్‌ సొల్యూషన్స్‌ కార్యాలయం 300 మంది ఉద్యోగులతో గురువారం ప్రారంభమయింది. ఎంపీ శ్రీభరత్‌ హాజరై అనుబంధ సంస్థ ప్రూవెన్‌ టెక్‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఈ కార్యాలయం రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నదని, త్వరలో ఉద్యోగుల సంఖ్య 900కు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ఇక్కడి 300 మంది ఉద్యోగుల్లో 80 మంది ఇతర ప్రాంతాల నుంచి బదిలీపై రాగా 200 మంది స్థానిక యువతను తీసుకున్నారన్నారు. కంపెనీ ఇండియా ఎండీ కునాల్‌ మాట్లాడుతూ ఇది విదేశీ బ్యాక్‌ ఆఫీస్‌ లేదా అవుట్‌ సోర్సింగ్‌ కేంద్రంగా కాకుండా ఇన్నోవేషన్‌ సెంటర్‌గా రూపుదిద్దుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రూవెన్‌ టెక్‌ ప్రతినిధి రాజు, సింబియోసిస్‌ టెక్నాలజీస్‌ సీఈవో నరేశ్‌కుమార్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.


జగన్నాథ రథయాత్రకు ప్రత్యేక రైళ్లు

విశాఖపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): పూరి జగన్నాథుని రథయాత్రకు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టామని సీపీఆర్‌వో వై.బాలాజీకిరణ్‌ తెలిపారు. విశాఖ-పూరి (08551) రైలు ఈనెల 15, 23న మధ్యాహ్నం 12.30కు విశాఖలో బయలుదేరి అదేరోజు రాత్రి 9.30కు పూరి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 17, 25న రాత్రి 2.30కు పూరిలో బయలుదేరి ఉదయం 11.05కు విశాఖ చేరుతుంది. జగదల్‌పూర్‌-పూరి (08553) ప్రత్యేక రైలు ఈనెల 15, 23న ఉదయం 6 గంటలకు జగదల్‌పూర్‌లో బయలుదేరి మరుసటిరోజు రాత్రి 1.40కు పూరి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 16, 24న రాత్రి 7.15 గంటలకు పూరిలో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.15కు జగదల్‌పూర్‌ చేరుతుంది.


నేడు రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాక

విశాఖపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శుక్రవారం జిల్లాకు రానున్నారు. సాయంత్రం ఆరు గంటలకు విమానంలో ఆయన నగరానికి చేరుకుంటారు. రాత్రి ఏడు గంటల నుంచి అధికారులు, సెయిలర్స్‌తో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. మరుసటి రోజు శనివారం ఉదయం 9.50 గంటలకు నేవల్‌ డాక్‌యార్డులో మహేంద్ర గిరి కమిషనింగ్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం విశాఖ నుంచి విమానంలో ఢిల్లీకి వెళతారు.


నేడు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పర్యటన

విశాఖపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌నజీర్‌ శుక్రవారం జిల్లాకు రానున్నారు. రాత్రి 9.40 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి బస చేస్తారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ హాల్‌లో జరిగే (జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ-గురజాడ, విజయనగరం (జేఎన్‌టీయూ-జీవీ) విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.55 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని విజయవాడ వెళతారు.


స్టీల్‌ప్లాంటుకు మరిన్ని కష్టాలు

అధికారులతో సీఎండీ ప్రభాకర్‌

విశాఖపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రానున్న రోజులు స్టీల్‌ప్లాంటుకు కష్టతరంగా ఉంటాయని, ఉద్యోగులంతా కలిసి పనిచేయాల్సి ఉందని విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు సీఎండీ ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. గత రెండు రోజులుగా అన్నిస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్లాంటు ఎదుర్కొన్న అన్ని సమస్యలను వివరిస్తున్నారు. చేతిలో కేవలం నెల రోజుల ఉత్పత్తికి సరిపడా నిధులు మాత్రమే ఉన్నాయని, ఆ తరువాత పరిస్థితి ఏమిటనేది తన చేతుల్లో లేదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిలో కేంద్రం నుంచి రెండో విడత సాయం అందుతుందని అంచనా వేయలేకపోతున్నామన్నారు. ప్లాంటులో అన్ని నిర్వహణ పనులు కాంట్రాక్టర్లకు అప్పగించామని, పూర్తి మొత్తాలు చెల్లిస్తున్నామని, దానికి తగిన పనిని వారి నుంచి రాబట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కొన్ని విభాగాల్లో పదే పదే బ్రేక్‌డౌన్స్‌ వస్తున్నాయన్నారు. వివిధ విభాగాల మధ్య సమన్వయం లేదని, ఇది సమీకృత కర్మాగారమని, ఒక విభాగంలో జాప్యం జరిగితే దాని ప్రభావం మిగిలిన వాటిపై పడుతుందన్నారు. ఆదాయం సమకూర్చే కొత్త ఆలోచనలు పంచుకోవాలని, వృథా మెటీరియల్‌, తుక్కు నుంచి ఆదాయం తీసుకురావాలని సూచించారు.


విశాఖ డెయిరీ పెరుగు ధర పెంపు

ఫుల్‌క్రీమ్‌ పాలపైనా భారం

అక్కిరెడ్డిపాలెం, జూలై 9 (ఆంధ్రజ్యోతి):

విశాఖ డెయిరీ పెరుగు, ఫుల్‌క్రీమ్‌ పాల ధరలను పెంచినట్టు డెయిరీ యాజమాన్యం గురువారం ప్రకటించింది. 400 గ్రాముల పెరుగు కప్పు రూ.32 ఉండగా రూ.35కు పెంచారు. 425 గ్రాముల పెరుగుప్యాకెట్‌ రూ.30 నుంచి రూ.32కు, పెరుగు బకెట్‌ (కేజీ) రూ.95 నుంచి రూ.100కు పెంచారు. ఫుల్‌క్రీమ్‌ పాలు అరలీటర్‌ ప్యాకెట్‌ రూ.34 నుంచి రూ.36కు, లీటర్‌ ప్యాకెట్‌ రూ.68 నుంచి రూ.71కు పెంచినట్టు యాజమాన్యం ప్రకటించింది. పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

Updated Date - Jul 10 , 2026 | 12:59 AM