Share News

నిరాటంకంగా ఎన్‌టీఆర్‌ వైద్య సేవలు

ABN , Publish Date - Apr 02 , 2026 | 01:28 AM

జిల్లాలోని ‘ఎన్‌టీఆర్‌ వైద్య సేవ’ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందుతున్నాయని కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కొయ్యాన అప్పారావు తెలిపారు. ఆస్పత్రులు సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో అందుతున్న సేవల వివరాలను ఆయన బుధవారం విలేకరులకు వెల్లడించారు.

నిరాటంకంగా  ఎన్‌టీఆర్‌ వైద్య సేవలు

జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.అప్పారావు

సమ్మెలో పాల్గొంటున్నది నాలుగు ఆస్పత్రిలే...

మిగిలిన 61 ఆస్పత్రుల్లో యథావిధిగా వైద్యం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని ‘ఎన్‌టీఆర్‌ వైద్య సేవ’ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందుతున్నాయని కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కొయ్యాన అప్పారావు తెలిపారు. ఆస్పత్రులు సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో అందుతున్న సేవల వివరాలను ఆయన బుధవారం విలేకరులకు వెల్లడించారు. జిల్లాలో 65 ఆస్పత్రులు ఎన్‌టీఆర్‌ వైద్య సేవ నెట్‌వర్క్‌ పరిధిలో ఉండగా, వాటిలో నాలుగు (కిమ్స్‌ ఐకాన్‌, వీజే, కేర్‌ (రామ్‌నగర్‌) ఇండస్‌ ఆస్పత్రులు) మాత్రమే సమ్మెలో భాగస్వామ్యమైనట్టు వెల్లడించారు. మిగిలిన 61 ఆస్పత్రులు సమ్మెలో పాల్గొనడం లేదని, యథావిధిగా సేవలు అందిస్తున్నాయని తెలిపారు. సమ్మెలో పాల్గొంటున్న నాలుగు ఆస్పత్రులు కూడా అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో రోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైద్య సేవలు అందడంలో ఇబ్బందులు ఎదురైతే ఆస్పత్రుల్లో ఉన్న ఆరోగ్య మిత్ర వద్దకు వెళ్లి సమాచారాన్ని అందించాలని, వారు వెంటనే తమ దృష్టికి తీసుకువస్తారన్నారు. వైద్య సేవలు అందించేందుకు నిరాకరించే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే 9281068145 నంబర్‌కు సంప్రతించాలని సూచించారు.

Updated Date - Apr 02 , 2026 | 01:28 AM